Women Safety: మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం ఫేక్
ABN , Publish Date - Aug 23 , 2024 | 04:28 AM
రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ప్రయాణించే మహిళలను పోలీసులు తమ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుస్తారంటూ... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.
సోషల్ మీడియాలో ప్రచారంపై తెలంగాణ పోలీసుల స్పష్టత
అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలని సూచన
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ప్రయాణించే మహిళలను పోలీసులు తమ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుస్తారంటూ... సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. అలాంటి పథకాన్ని తాము అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. వదంతులు నమ్మవద్దని సూచించారు.
పోలీసులు మహిళల కోసం ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు 1091, 78370 18555 నెంబర్లుకు ఫోన్ చేసి సాయం అడిగితే సమీపంలోని పోలీసు వాహనం వారిని గమ్యస్థానానికి చేరుస్తుందనే సందేశం వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా తిరుగుతోంది. ఈ సందేశం తప్పుడు సమాచారమని ప్రకటించిన పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ప్రజలు 100కు డయల్ చేయాలని సూచించారు.