Share News

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:54 AM

తెలంగాణలో 4,73,838 మంది యువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా సుమారు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

  • మొత్తం ఓటర్లు 3.34 కోట్లు.. అందులో మహిళలే అధికం

  • 4.14 లక్షల డూప్లికేట్ల తొలగింపు.. జనవరిలో తుది జాబితా

  • ఈ నెల 9, 10న స్పెషల్‌ డ్రైవ్‌: సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 4,73,838 మంది యువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా సుమారు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు. కొత్త వారితో కలిపి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరిందని ఆయన వివరించారు. వీరిలో 1,66,16,446 మంది పురుష ఓటర్లు, 1,68,07,100 మంది మహిళా ఓటర్లు, 2777 మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారన్నారు. బీఆర్‌కే భవన్‌లోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సుదర్శన్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఓటర్ల తుది జాబితా జనవరి 6న ప్రకటిస్తామన్నారు. ఓటర్ల నమోదుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9, 10న స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు.


గ్రామీణ ప్రాంత రైతులు, యువత నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు శని, ఆదివారాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్నారు. ఆ రెండు రోజులు అన్ని నియోజకవర్గాల్లో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. నేరుగా వెళ్లి లేదా, సీఈవో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటరు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 వరకు స్వీకరిస్తామని సీఈవో తెలిపారు. అధికారిక సోషల్‌ మీడియా వేదిక ద్వారా కూడా తమ అభ్యంతరాల్ని అధికారుల దృష్టికి తేవచ్చన్నారు. టోల్‌ ఫ్రీ నెంబరు 1950కు కూడా తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చన్నారు. పరిశీలన అనంతరం 4 లక్షల 14 వేల 165 డూప్లికేట్‌ ఓట్లు తొలగించామని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Nov 03 , 2024 | 04:55 AM