Share News

Utham Kumar Reddy: జనవరి నుంచి సన్న బియ్యం

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:39 AM

రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

Utham Kumar Reddy: జనవరి నుంచి సన్న బియ్యం

  • చౌక ధర దుకాణాల్లో సబ్సిడీపై గోధుమలు.. బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తే చర్యలు

  • డీలర్‌షిప్‌ రద్దు చేయడమే కాక జరిమానా

  • పౌరసరఫరాలమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • సన్నబియ్యంపై గతంలోనే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్‌ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఇది అత్యంత కీలకమైనదని తెలిపారు. సచివాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.


సన్న బియ్యంతో పాటు గోధుమలను కూడా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పీడీఎస్‌ బియ్యం అక్రమార్కుల పాలుకాకుండా చూడాలని.. కొందరు రేషన్‌ డీలర్లు నల్ల బజారుకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలాంటివారి డీలర్‌షిప్‌ రద్దు చేయడమే కాక జరిమానా విధిస్తామన్నారు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించి ప్రోత్సాహకాలు ఇస్తామని స్పష్టం చేశారు. బలవర్ధక బియ్యం (పోర్టిఫైడ్‌ రైస్‌)లో కూడా నాణ్యత పాటించడం లేదని.. తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలకు నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తమ్‌ కోరారు. ప్రస్తుత కార్డులకు అదనంగా అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని కోరారు. చౌక ధర డిపోల్లో 1,629 ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. శాఖలో సమస్యలపై నివేదిక నివేదిక ఇవ్వాలని మంత్రి కోరగా.. పది రోజుల్లో సమర్పిస్తామని కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ చెప్పారు.


పొంగులేటి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన బియ్యంలో నాణ్యత లోపిస్తోందని, ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. విద్యార్థులకు సరిపడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వం జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మే నెల 23నే ‘ఆంధ్రజ్యోతి’ చెప్పింది. ‘సంక్రాంతికి సన్న బువ్వ!’ శీర్షికన కథనం ప్రచురించింది.


  • నెల్లికల్లు లిఫ్ట్‌కు భూసేకరణ పూర్తిచేయాలి

రైతులతో సంప్రదింపులు జరిపి నెల్లికల్‌ ఎత్తిపోతలకు భూ సేకరణను వెంటనే చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి జానారెడ్డి, నల్లగొండ ఎంపీ రఘుర్‌వీర్‌రెడ్డి, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, నల్లగొండ కలెక్టర్‌ నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ అజయ్‌కుమార్‌తో గురువారం మంత్రి సమీక్ష జరిపారు. అటవీ భూములకు అదనంగా చెల్లించాల్సిన నిధుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరారు. 23 కోట్ల విద్యుత్తు బకాయిల చెల్లింపునకు ప్రతిపాదనలు తక్షణమే పంపించాలన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 03:39 AM