Sridhar Babu: హైదరాబాద్‌లో శీతల రవాణా కేంద్రం: దుద్దిళ్ల
ABN , Publish Date - Sep 20 , 2024 | 04:19 AM
హైదరాబాద్‌లో అత్యాధునిక శీతల రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అత్యాధునిక శీతల రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇక్కడి పారిశ్రామిక అవసరాలకు తగినవిధంగా మార్పులు చేసేందుకు బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. గురువారం నోవాటెల్ హోటల్‌లో జరిగిన ‘కోల్డ్‌చెయిన్ అన్‌బ్రోకెన్-2024’ గ్లోబల్ సదస్సులో శ్రీధర్‌బాబు మాట్లాడారు. త్వరగా చెడిపోయే ఆహార వస్తువులు, పూల లాంటి ఉద్యానవన ఉత్పత్తులను శీతల రవాణా వ్యవస్థ ద్వారా నష్టం వాటిల్లకుండా తరలించవచ్చన్నారు.
శీతల నిల్వ వ్యవస్థలు, వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ కంటైనర్లు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 14శాతం ఆహార ఉత్పత్తులు వృథాగా పోతున్నాయన్నారు. ప్యాకేజింగ్‌లో కూడా పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని, ఈ రంగానికి అవసరమైన రవాణా సదుపాయాలు పెంపొందించాలని నిర్వాహకులను మంత్రి కోరారు. ‘కోల్డ్‌చెయిన్ అన్‌బ్రోకెన్’ చైర్మన్ సతీశ్ లక్కరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శీతల రవాణా వ్యవస్థ టర్నోవర్ 300 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, 20 దేశాల నుంచి 350 మందికిపైగా ఈ పరిశ్రమకుచెందిన నిపుణులు పాల్గొన్నారు.