Share News

Uttam: కాళేశ్వరం ప్యాకేజీ పనుల వేగవంతానికి ఆదేశం

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:05 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు రిజర్వాయర్‌కు 20 టీఎంసీలు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్యాకేజీ-19ఏ పనులను పునఃప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Uttam: కాళేశ్వరం ప్యాకేజీ పనుల వేగవంతానికి ఆదేశం

  • నల్లవాగు ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్‌.. నీటి పారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు రిజర్వాయర్‌కు 20 టీఎంసీలు నీటిని తరలించడానికి ఉద్దేశించిన ప్యాకేజీ-19ఏ పనులను పునఃప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కాళేశ్వరం ప్యాకేజీ పనులపై జలసౌధలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ 19ఏ కింద ప్రధాన కాలువ 82వ కిలోమీటరు నుంచి 109.5 కిమీ వరకు చేపట్టాల్సిన కెనాల్‌ లైనింగ్‌, పంప్‌హౌస్‌ తదితర పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సింగూరు కాలువల లైనింగ్‌ పనులకు రూ.168.30కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూడికతీత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనుల్లో వేగం పెంచాలన్నారు.


పెద్డారెడ్డిపేట ఎత్తిపోతల పథకం పనులకు డిసెంబరు నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గ పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్‌ కెనాల్‌తోపాటు జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కారముంగి గ్రామంలో మంజీరా నదిపై చేపట్టనున్న నల్లవాగు ఎత్తిపోతల పథకానికి మంత్రి ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. 6030 ఎకరాలకు సాగునీటిని అందించేలా రూ.73.70 కోట్ల వ్యయంతో చేపట్టే నల్లవాగు పథకానికి అవసరమైన పరిపాలన అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, పునరావాసం, పునర్‌నిర్మాణ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, డిసెంబరు 4న పెద్దపల్లి వేదికగా సీఎం సభ జరగనున్న నేపథ్యంలో కరీంనగర్‌ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి... కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం సభను జయప్రదం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:05 AM