పనికొచ్చే చదువు
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:40 AM
పరిశ్రమల అవసరాలు నానాటికీ మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు, చేర్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్యప్రణాళిక (కరికులమ్)ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా
ఉన్నత విద్య పాఠ్య ప్రణాళిక
డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి అన్ని
ఉన్నత విద్య కోర్సుల్లో మార్పులపై దృష్టి
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు
కొత్త కరికులమ్ ఖరారుకు 4 కమిటీలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల అవసరాలు నానాటికీ మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు, చేర్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా తీసుకువచ్చే కొత్త పాఠ్యప్రణాళిక (కరికులమ్)ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్య కోర్సుల్లో ఈ మార్పులను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంఽధించిన కసరత్తును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. పరిశ్రమల అవసరాల మేరకు నైపుణ్యాలను సిలబ్‌సలో అంతర్భాగం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త కరికులాన్ని ఖరారు చేయడం కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో బీకాం, లా కోర్సులకు కమిటీని నియమించారు. సైన్స్ కోర్సులకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహమూద్, ఆర్ట్స్ కోర్సులకు మరో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఇంజనీరింగ్ కోర్సులకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ స్టీరింగ్ కమిటీలు త్వరలోనే వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లతో సంప్రదింపులు జరిపి అవసరమైన మార్పులపై చర్చిస్తాయి. ఈ నేపథ్యంలో శనివారం సైన్స్ కోర్సుల కరికులమ్, సిలబస్ రూపకల్పనపై సంప్రదింపులు జరపనున్నారు. ఈ విధంగా ఆయా సబ్జెకులపై స్టీరింగ్ కమిటీలు వరుసగా భేటీకానున్నాయి. చర్చల అనంతరం కొత్త కరికులమ్‌పై ప్రత్యేక నివేదికను రూపొందించనున్నారు. ప్రభుత్వం అనుమతి అనంతరం ఈ కొత్త కరికులాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కరికులమ్‌ను అమలుపరిచే అవకాశం ఉంది.
ఉన్నత విద్యను పరిశ్రమలకు అనుసంధానించేలా ప్రభుత్వ చర్యలు..
రాష్ట్రంలో ఉన్నత విద్యను, పరిశ్రమలకు అనుసంధానించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉపాధి లభించే విధంగా కోర్సులు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కోర్సులను ప్రారంభిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని ఐఐటీలను కూడా టెక్నిక ల్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం టాటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఇతర ఉన్నత విద్య కోర్సుల్లోనూ మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఆయా కోర్సుల్లో మార్పులు, చేర్పులపై కరికులమ్‌ను రూపొందించాలని నిర్ణయించారు.
మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా డిగ్రీ కోర్సులు..
డిగ్రీ కోర్సుల్లో మార్పులు, చేర్పులు ఎక్కువుండే అవకాశం ఉంది. డిగ్రీ కోర్సులను మరింత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దనున్నారు. బయటి మార్కెట్‌లో నానాటికీ సాంకేతిక పెరిగిపోవడం, పరిశ్రమల్లో ఆధునికీకరణ చోటుచేసుకుంటోంది. ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సులు ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ముఖ్యంగా రాష్ట్రంలో రిటైల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. దానికి తగ్గట్టుగా కోర్సులను రూపొందిస్తే.. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ కంప్యూటర్‌పై కనీసం అవగాహన అవసరం ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ స్థాయిలోనూ కంప్యూటర్ కోర్సును విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఉన్నత విద్యలో క్లాస్ రూం తరగతులతోపాటు ప్రాక్టికల్స్‌నూ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తద్వారా విద్యార్థి తన చదువు పూర్తయ్యే సమయానికి కొంత అవగాహన, అనుభవం లభించే అవకాశం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా ఆయా రంగ ప్రముఖ కంపెనీలతో ఒక అవగాహనకు వచ్చి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇప్పించే విధంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది.