Share News

Loan Waiver: మిగిలిన అర్హులందరికీ వారంలో రుణమాఫీ

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:37 AM

వారం, పది రోజుల్లో అర్హులైన మిగతా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు.

Loan Waiver: మిగిలిన అర్హులందరికీ వారంలో రుణమాఫీ

  • మూడ్రోజుల్లోగా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు

  • జనవరి నుంచి రేషన్‌లో సన్నబియ్యం: కోమటిరెడ్డి

  • నల్లగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నల్లగొండ టౌన్‌, అక్టోబరు 9: వారం, పది రోజుల్లో అర్హులైన మిగతా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో గత సీజన్‌లో సైతం ధాన్యం కొనుగోలు చేసిన మూడ్రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేశామని, ఈ సీజన్‌లోనూ మూడ్రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని తెలిపారు.


రూ.2 లక్షల కన్నా ఎక్కువగా ఉన్న రైతుల రుణాలనూ వారం, పది రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పారు. సన్న ధాన్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేకించి తమ ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తోందన్నారు. పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో వచ్చే జనవరి నుంచి రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అన్ని సామాజికవర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లను కట్టిస్తున్నామని, తొలి విడతలో 20నియోజకవర్గాల్లో ఈ నెల 11వ తేదీన హాస్టల్‌ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 03:37 AM