Share News

CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:11 AM

తెలంగాణలో ప్రభుత్వం చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన దేశానికే రోల్‌ మోడల్‌ కానుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది.. దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు.

CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

  • రాష్ట్రంలో కులగణన పూర్తిచేసి సన్నద్ధమవుదాం

  • దేశ వ్యాప్తంగా చేపట్టే పరిస్థితిని కల్పిద్దాం.. రోల్‌ మోడల్‌గా తెలంగాణ

  • ప్రజలకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టాలి

  • పార్టీకి నష్టం చేస్తే సహించం.. విపక్షాల కుట్రల్ని తిప్పికొట్టాలి: రేవంత్‌

  • కేంద్ర జనగణనలో ఓబీసీ గణననూ చేర్చాలి: టీపీసీసీ తీర్మానం

  • కులగణనపై రాష్ట్ర స్థాయిలో సభ.. రాహుల్‌ వచ్చే అవకాశం

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రభుత్వం చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన దేశానికే రోల్‌ మోడల్‌ కానుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది.. దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు. నవంబరు 31 కల్లా రాష్ట్రంలో కులగణనను పూర్తి చేసుకుని.. దేశవ్యాప్తంగా దీనిని చేపట్టాల్సిన పరిస్థితి కల్పించాలని, ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ నుంచే యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో తెలంగాణ మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్‌ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతామన్నారు.


తెలంగాణలో కులగణన చేపడతామంటూ ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం ఒక్కసారి మాట ఇచ్చారంటే ఎట్టిపరిస్థితుల్లోనూ నెరవేర్చి తీరతారని అన్నారు. రాహుల్‌గాంధీ మాటను నిలబెట్టడం కాంగ్రెస్‌ నాయకులందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం. రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. కాంగ్రెస్‌ పార్టీయే రేవంత్‌రెడ్డికి గుర్తింపు ఇచ్చింది. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులే’’ అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్ని అమలు చేయడమే ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే కాంగ్రెస్‌ భావజాలంతో సంబంధం ఉన్న గోపిశెట్టి నిరంజన్‌ను బీసీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించుకున్నామని తెలిపారు.


పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతి క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదని, ఇది మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిదని అభివర్ణించారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించాలని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌కు సీఎం సూచించారు. ఈ విషయంలో నేతలు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించబోదని స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తు చేశారు. ఈ పది నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గ్రూప్‌-1 విషయంలోనూ విపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయని సీఎం ఆరోపించారు. జీవో, నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్‌ ఫలితాలు వచ్చినప్పుడు కాకుండా.. మెయిన్స్‌ నిర్వహించే సందర్భంలో జారీ చేసిన జీవో 29పై కోర్టుకు వెళ్లారని, వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టూ కొట్టివేసిందని గుర్తు చేశారు.


  • పార్టీకి నష్టం కలిగిస్తే సహించం..

అగ్రవర్ణాల కోసమే గ్రూప్‌-1 నిర్వహిస్తూ.. బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారనే వాదనను కొంత మంది తీసుకువచ్చారని రేవంత్‌ తెలిపారు. అయితే మెయిన్స్‌కు ఎంపికైన 31,383 మంది అభ్యర్థుల్లో అగ్రవర్ణాల వాళ్లు పది శాతం లోపు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బీసీలు 57.11 శాతం ఉంటే.. ఎస్సీలు 15.38 శాతం, ఎస్టీలు 8.87 శాతం, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 8.84 శాతం ఎంపికయ్యారని వివరించారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి’’ అని సీఎం అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, కుల సర్వేతో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత, సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కులగణనపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాగా, కులగణన కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు. ఈ సర్వేకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా.. నివృత్తి చేసేందుకు గాంధీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


  • 2న జిల్లాల వారీగా సమావేశాలు

కులగణనపై నవంబరు 2న రాష్ట్రంలోని 33 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అవగాహనా సమావేశాలు నిర్వహించాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. కుల సంఘాలు, సివిల్‌ సొసైటీలు తదితరులను ఆ సమావేశాలకు ఆహ్వానించాలన్నారు. కులగణనపై సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 7 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని హైకోర్టుకు వివరాలు సమర్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ఓబీసీ గణనా చేపట్టాలంటూ సమావేశం తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. కాగా.. గత ప్రభుత్వం చేసిన ఆరాచకాలకు సంబందించి చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా మహేశ్‌కుమార్‌ చెప్పారు. కులగణనపై రాష్ట్ర స్థాయిలో నవంబరు 5 లేదా 6న బారీ బహిరంగ సభన నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఆయన ఇచ్చే సమయాన్ని బట్టి సభ తేదీ ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


  • గిరిజన విద్యార్థినికి సీఎం రేవంత్‌ ఆర్థికసాయం

ఎంబీబీఎ్‌సలో సీటు సంపాదించినా.. కళాశాల ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థిని సాయి శ్రద్ధకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. కొమురం భీమ్‌ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సాయి శ్రద్ధ పరిస్థితి తన దృష్టికి రావడంతో.. ఆమె డాక్టర్‌ కావాలన్న కలను నెరవేర్చే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఆర్థిక సాయాన్ని అందించారు.


  • ఇందిరమ్మ పాలనే మా ప్రభుత్వానికి ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైకత్య, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిన ధీర వనిత ఇందిరాగాంధీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించకుని సీఎం ఆమెను స్మరించుకున్నారు. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరాగాంధీ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఆమె స్ఫూర్తితో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపడుతున్నామని రేవంత్‌ తెలిపారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని సీఎం ఆయనకు నివాళులు అర్పించారు. సంస్థానాల విలీనం ద్వారా భారతదేశ సార్వభౌమత్వానికి నిండుదనాన్ని చేకూర్చిన మహనీయుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని కొనియాడారు.

Updated Date - Oct 31 , 2024 | 03:11 AM