Uttam: బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే!
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:03 AM
గతంలో మాదిరిగా రైస్ మిల్లర్లకు అప్పనంగా ధాన్యం అప్పగించకుండా... బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కేటాయించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది.
అవి ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు
ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచేందుకూ ఓకే
ఈ సిఫారసులతో ధాన్యం పాలసీ-24 సిద్ధం
నేడు సీఎం రేవంత్‌కు అందజేత
ఈ సారి రికార్డు స్థాయిలో కొనుగోళ్లు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గతంలో మాదిరిగా రైస్ మిల్లర్లకు అప్పనంగా ధాన్యం అప్పగించకుండా... బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాతే కేటాయించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. నిర్ణీత ధాన్యం పరిమాణానికి అనుగుణంగా బ్యాంకుల్లో ఆస్తులు తాకట్టుపెట్టి.. బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తీసుకొని, పౌరసరఫరాల సంస్థకు అప్పగించిన రైస్ మిల్లర్లకే ఇకపై ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ధాన్యం సేకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో ఏర్పాటైన ఉప సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని వర్గాలతో చర్చించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసి ఖరీఫ్ ధాన్యం పాలసీ-2024ని రూపొందించింది. సంబంధిత నివేదికను గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయనుంది.
ఈనెల 26 న జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఖరీఫ్ ధాన్యం పాలసీకి ఆమోద ముద్ర వేయనున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో బుధవారం మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై తుది నివేదిక సిద్ధమైందని, గురువారం సీఎం రేవంత్‌కు అందజేస్తామని వెల్లడించారు. బ్యాంకు గ్యారెంటీలతోపాటు మిల్లింగ్ చార్జీల పెంపుపైనా కీలక సిఫారసులు చేసినట్లు తెలిపారు. గోదాముల్లో 10 లక్షల టన్నుల ధాన్యం నిల్వ, ఆ సమయంలో తరుగు నష్టంపై ఉపసంఘం అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... 60.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని... 146.70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో 30 లక్షల టన్నులు దొడ్డు రకం, 50 లక్షల టన్నులు సన్న రకం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోన్‌సను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే నేరుగా రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాట్లు చేశామన్నారు. సన్న రకం ధాన్యం నిల్వకు ప్రత్యేకంగా గోదాములు ఉండాలని నిర్దేశించినట్లు తెలిపారు. మొత్తం 7,248 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాంభిస్తున్నామని, ఇందులో 2,539 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు సరిపడా గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచామన్నారు.
ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు పర్యవేక్షిస్తుంటాయన్నారు. దళారుల చేతిలో రైతాంగం మోసపోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించినంత వరకు ప్రతికూల వార్తలు వస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించమన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి టోల్-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ఉత్తమ్ తెలిపారు. 1,440 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు కొత్త రికార్డులను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.