Cotton Purchase: పత్తి కొనుగోళ్లు బంద్..!
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:07 AM
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. నిరవధిక సమ్మె దిశగా జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లర్లు అడుగులు వేస్తున్నారు. ‘‘కొనుగోళ్లను నిలిపేశాం.
నేటి నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం!.. సీసీఐ నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల కన్నెర్ర
నిరవధిక సమ్మె దిశగా అడుగులు
ఎల్-1, 2, 3 నిబంధనలతో రైతులకు తిప్పలు
అన్ని సెంటర్లలో పత్తి కొనుగోళ్లకు.. కాటన్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, ఆదిలాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు బంద్ అయ్యాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. నిరవధిక సమ్మె దిశగా జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లర్లు అడుగులు వేస్తున్నారు. ‘‘కొనుగోళ్లను నిలిపేశాం. రైతులు సహకరించాలి. దయచేసి పత్తిని తీసుకురావొద్దు’’ అంటూ కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆరుగాలం శ్రమించి, పత్తిని పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్ల నిర్ణయానికి కారణం.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొత్త నిబంధనలే..! గతంలో మాదిరిగా కాకుండా.. ఎల్-1, ఎల్-2, ఎల్-3 పేరుతో కొనుగోళ్ల బాధ్యతలను విడతల వారీగా చేపట్టాలని సీసీఐ నిర్ణయించింది. అంటే.. పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ జాబ్‌వర్క్‌ను సీసీఐ మూడు క్యాటగిరీలుగా విభజించింది. అతి తక్కువ ధరకు జిన్నింగ్ చేసే మిల్లర్లను ఎల్-1, కాస్త ఎక్కువ కోట్ చేసిన వారిని ఎల్-2, అధిక ధరకు జిన్నింగ్ చేస్తామనే వారిని ఎల్-3 క్యాటగిరీలుగా విభజించింది. తొలుత కొనుగోలు బాధ్యతలను ఎల్-1 మిల్లర్లకు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 318 జిన్నింగ్ మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసింది. మిల్లర్లు పత్తిలో గింజలను తొలగించి, జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసి.. బేళ్లుగా మార్చాక.. తిరిగి సీసీఐ స్వాధీనం చేసుకుంటుంది.
మంత్రులు చర్చలు జరిపినా..
రాష్ట్రంలో ఒక్కో పత్తి బేల్ జిన్నింగ్/ప్రెస్సింగ్‌కు మిల్లర్లు రూ.1,495 నుంచి రూ.1,550 వరకు కోట్ చేశారు. దాంతో.. ధర ఎక్కువగా కోట్ చేసిన వారి వద్ద మిల్లింగ్‌తో తమకు గిట్టుబాటు కాదంటూ సీసీఐ పేచీ మొదలుపెట్టింది. దాంతో.. 318 కేంద్రాలకు గాను.. ఎల్-1 కింద కోట్ చేసిన 165 కేంద్రాలకే జాబ్‌వర్క్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో.. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఆయన సమక్షంలో సీసీఐ అధికారులు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల తర్వాత.. గత ఏడాది నిర్ణయించిన రూ.1,345కు రూ.5 కలిపి.. బేల్‌కు రూ.1,350 చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో తమకు నచ్చిన మిల్లర్లకు రైతులు స్వేచ్ఛగా పత్తిని అమ్ముకునే వెసులుబాటు కలిగింది. చర్చల సందర్భంగా సరేనని చెప్పిన సీసీఐ.. ఆ తర్వాత మాట మార్చింది. దేశమంతా ఒక నిబంధన.. రాష్ట్రంలో మరోలా కుదరదని పేర్కొంటూ, తొలుత ఎల్-1 కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు సిద్ధమని ప్రకటించింది.
దీని వల్ల అటు మిల్లర్లకు జాబ్‌వర్క్ ఉండదని, రైతులకు దూరాభారం తప్పదని కాటన్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పునఃపరిశీలించాలని సీసీఐని కోరింది. సీసీఐ అధికారులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో.. అసోసియేషన్ నిరవధిక సమ్మె దిశలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల గేట్లకు తాళాలు వేసింది. గేట్ల వద్ద రైతులు పత్తిని తీసుకురావద్దని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ప్రైవేటు కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని జిన్నింగ్/ప్రెస్సింగ్ పరిశ్రమల యజమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖలు రాసింది. తమ సమస్య పరిష్కారమయ్యేదాకా పత్తి కొనుగోళ్లను పునరుద్ధరించేది లేదని ఆ లేఖల్లో స్పష్టం చేసినట్లు తెలంగాణ కాటన్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సీసీఐ అధికారలుఉ జిన్నింగ్ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిపితే.. రైతులు కూడా దూరాభారం, రవాణా ఖర్చులతో నష్టపోతారని వాపోయారు.
పత్తి రైతుల్లో గుబులు
కాటన్ అసోసియేషన్ నిర్ణయంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావం.. ఆ తర్వాత భారీవర్షాలతో పత్తిచేలు జాలుపట్టిపోయాయి. తెగుళ్లు, చీడపీడల బెడద కూడా ఈ సారి తీవ్రంగా ఉంది. ఫలితంగా దిగుబడి ఎకరానికి 10-12 క్వింటాళ్లకు బదులు.. ఐదారు క్వింటాళ్లకు పడిపోయింది. దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న రైతులు.. ఇప్పుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీసీఐ 50వేల నుంచి 60 బేళ్ల వేల పత్తిని కొనుగోలు చేసినా.. ప్రైవేటులో 2.50 లక్షల బేళ్ల పత్తి విక్రయాలు జరిగినా.. దీపావళి తర్వాత పత్తితీత జోరందుకుంటుంది. వరుస సెలవుల తర్వాత.. సోమవారం నుంచి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులు నిర్ణయించారు. ఈ వారం మార్కెట్‌కు పత్తి పోటెత్తే అవకాశాలుండగా.. జిన్నింగ్ మిల్లర్ల సమ్మెతో రైతులు కుదేలవుతున్నారు.