Share News

Kandukur: స్కిల్స్‌ వర్సిటీ భవనాల డిజైన్లు ఖరారు

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:30 AM

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణాల డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు.

Kandukur: స్కిల్స్‌ వర్సిటీ భవనాల డిజైన్లు ఖరారు

  • నవంబరు 6 నుంచి నిర్మాణ పనులు

  • 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం

  • భవనాల నిర్మాణం బాధ్యత మేఘాకే

హైదరాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ భవన నిర్మాణాల డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. నవంబర్‌ 6వ తేదీన పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పది నెలల్లోగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. యునివర్సిటీ క్యాంప్‌సలో అన్ని భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి బాధ్యతలను మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) తీసుకుంది. గత శనివారం ఈ మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కూడా చేసుకుంది. భవన నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఎంఈఐఎల్‌ అందించగా.. వాటినే ప్రభుత్వం ఖరారు చేసింది.


ఐదంతస్తుల్లో పరిపాలన భవనం చేపట్టనున్నారు. హాస్టళ్లు, స్టాఫ్‌ క్వార్టర్లు, ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్‌ ఏరియా ఉండేలా ఈ డిజైన్లు రూపొందించారు. సువిశాల ప్రాంగణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా భవన నమూనాలు తయారు చేయించారు. ఆరు వేల మంది విద్యార్థుల నైపుణ్య శిక్షణ, వసతి సదుపాయాలు ఉండేలా క్యాంప్‌సలో నిర్మాణాలను చేపడతారు. అన్ని భవనాలపై సౌర విద్యుత్తు ప్యానెళ్లను అమర్చనున్నారు. ఏసీల వాడకం లేకుండా కొన్ని భవనాల్లో సహజమైన గాలి వెలుతురు ఉండేలా అధునాతన డిజైన్లలో భవనాలు నిర్మించనున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలుండేలా వర్సిటీ క్యాంప్‌సను నిర్మించాలని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మెఘా కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. స్కిల్స్‌ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించగా.. అదానీ గ్రూప్‌ రూ.100 కోట్లు విరాళంగా అందించింది. భవనాల నిర్మాణానికి కావాల్సిన రూ. 200 కోట్లను మేఘా కంపెనీ అందించనుంది.

Updated Date - Oct 29 , 2024 | 03:30 AM