Share News

ఫార్మా క్లస్టర్‌ రద్దు!

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:50 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన లగచర్ల ఫార్మా క్లస్టర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందుకోసం గత ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకుంది.

ఫార్మా క్లస్టర్‌ రద్దు!

  • లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరణ

  • గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి

  • అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్క్‌

  • వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం

  • స్థానికులకు భారీగా ఉపాధికి అవకాశం

  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసీ

  • త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్‌?

  • తాండూరు సబ్‌ కలెక్టర్‌కు బాధ్యతలు

  • లగచర్లలో ఫార్మా విలేజ్‌ పెట్టడం లేదని

  • వారం క్రితమే వామపక్షాలకు చెప్పిన సీఎం

హైదరాబాద్‌/వికారాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన లగచర్ల ఫార్మా క్లస్టర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందుకోసం గత ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ పేరుతో పత్రిక ప్రకటన జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్థులు దాడి చేయడం, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా 28 మంది నిందితులను అరెస్టు చేయడం, పోలీసుల చర్యలపై గ్రామస్థులు ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్‌ వరకు వెళ్లడం, కమిషన్‌ బృందాలు రాష్ట్రానికి వచ్చి విచారణ జరపడంతో లగచర్ల భూసేకరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా క్లస్టర్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలు అంటే ప్రజల్లో అనుమానాలు ఉన్న నేపథ్యంలో దాని స్థానంలో అదేచోట బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌(టీజీఐఐసీ) రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో ఎక్కువగా వస్త్ర పరిశ్రమ ప్రాజెక్టులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో పెద్ద ఎత్తున స్థానికులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.


పారిశ్రామిక పార్కు భూసేకరణకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి తాండూరు సబ్‌ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఫార్మా విలేజ్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు ఇతర పరిశ్రమలు అయితే స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. లగచర్లలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేయబోవడం లేదని ఇటీవలే తనను కలిసిన వామపక్ష నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే అది ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండా, పులిచర్ల తండా, హకీంపేట్‌, పోలేపల్లిల్లో 1,359 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ ఫార్మా విలేజ్‌ ఏర్పాటు చేయాలని ఈ ఏడాదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదట రెండు తండాలతో కూడిన లగచర్లలో 580 మంది రైతుల నుంచి 632 ఎకరాల భూములను సేకరించేందుకు గత ఆగస్టు నెలలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. గత ఆరేడు నెలలుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తూ వచ్చారు. భూసేకరణ కోసం పలుమార్లు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభల్లో రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగాఈ నెల 11న లగచర్లలో గ్రామసభ నిర్వహించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, కొడంగల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డిలపై అక్కడి రైతులు, ఇతర గ్రామాల ప్రజలు దాడి చేశారు. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన అధికారులను తరుముతూ రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌లను కడా ప్రత్యేకాధికారి వాహనంలో అక్కడి నుంచి పంపించివేయగలిగారు. కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యారు.


ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించిన వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివా్‌సరెడ్డి పైన కూడా దాడి చేశారు. ఈ ఘటన వెనుక బీఆర్‌ఎస్‌ హస్తం ఉందని, ప్రధానంగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం్జ నరేందర్‌రెడ్డి ఉన్నారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 28 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. లగచర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగాయి. బీఆర్‌ఎస్‌ నేతలు బాధిత రైతుల కుటుంబాలను తీసుకొని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మహిళా కమిషన్‌లను కలిసి పోలీసులపై ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌ వారితో పాటు ఢిల్లీకి వెళ్లి జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేశారు. ఫార్మా విలేజ్‌ రద్దు చేయాలని, తమ భూములు తమకే ఉండేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిధుల బృందం లగచర్ల, రోటిబండ తండా గ్రామాల్లో పర్య్టటించి విచారణ జరిపారు. గ్రామస్థులతో పాటు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, కడా ప్రత్యేకాధికారి, విద్యుత్‌, పోలీసు అధికారులను కూడా విచారించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల ప్రతినిధులు బాధిత రైతుల కుటుంబాలతో మాట్లాడి తమ పర్యటనలో పరిశీలించిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 11 నుంచి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్‌ 11 ప్రకారం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ గజిట్‌ నెం.07/2024, తేదీ: 01-08-2024ను సెక్షన్‌ 93 ప్రకారం ఉపసంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), భూసేకరణ అధికారి/సబ్‌ కలెక్టర్‌ - తాండూరు ప్రకటన జారీ చేశారు.


  • రద్దు హర్షణీయం: సీపీఎం

భూసేకరణ ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రద్దు నిర్ణయానికి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన కృషే కారణమని, ఇది లగచర్ల ప్రాంత ప్రజల విజయం అని తెలిపింది. నవంబరు 21న వామపక్ష ప్రతినిధుల బృందం లగచర్ల, పరిసర గ్రామాల్లో పర్యటించిందని, వాస్తవాలను 23న సీఎం రేవంత్‌ని కలిసి వివరించామని వెల్లడించింది. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు ప్రతిఘటించారని, తక్కువ ధరతో భూములు లాక్కునే పద్ధతిని వ్యతిరేకించారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు.


  • లగచర్ల రైతుల బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

లగచర్ల ఘటనలో అరెస్టయి సంగారెడ్డి జిల్లాలో రిమాండ్‌లో ఉన్న రైతులకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు ఇదివరకే వాదనలు వినిపించారు. ధ్రువపత్రాలు సమర్పించేందుకు గడువు కావాలన్న ప్రాసిక్యూషన్‌ విజ్ఞప్తి మేరకు పిటిషన్‌ వాయిదా వేయగా శుక్రవారం విచారణకు వచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సెలవులో ఉండడంతో సోమవారానికి వాయిదా వేశారు.


  • లగచర్ల ఘటనపై ఒక ఎఫ్‌ఐఆర్‌ చాలు

  • పోలీసులకు హైకోర్టు ఆదేశం

    14.jpg

హైదరాబాద్‌/వికారాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనలో మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 153కి మాత్రమే పోలీసులు పరిమితం కావాలని శుక్రవారం హైకోర్టు స్పష్టం చేసింది. భూసేకరణ నిమిత్తం విచారణకు వచ్చిన కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడి చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఏ-1గా చేర్చుతూ తొలుత బొంరా్‌సపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఘటనలో దాడికి గురైన వేర్వేరు అధికారులు ఇచ్చిన ఫిర్యాదులతో అదనంగా మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే నేరంపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ.. ఒకే నేరానికి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని, ‘తీన్మార్‌ మల్లన్న’ కేసులోనూ ఇదే ధర్మాసనం దీన్ని పాటించిందని గుర్తుచేశారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. చివరి రెండు ఎఫ్‌ఐఆర్‌ను విలీనం చేయవచ్చని, దాంతో మొత్తం రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నట్టవుతుందని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఒకే నేరంపై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదని చాలా స్పష్టమైన తీర్పులు ఉన్నందున మొదటిదానినే కొనసాగించాలని తెలిపింది. ఆ తరువాత నమోదు చేసిన రెండింటిని నిలిపివేయాలని పేర్కొంది. దీంతో పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించినట్టయింది.

Updated Date - Nov 30 , 2024 | 03:50 AM