Share News

Student Health: ‘కలుషిత ఆహారం’పై టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:25 AM

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలను సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.

Student Health: ‘కలుషిత ఆహారం’పై టాస్క్‌ఫోర్స్‌

  • ఘటనలపై విచారణ నిమిత్తం త్రిసభ్య కమిటీ

  • కారణాలు, బాధ్యుల్ని గుర్తించి నివేదికకు ఆదేశం

  • హాస్టల్‌, విద్యాలయంలో ఆహార భద్రత కమిటీలు

  • రోజూ కిచెన్‌, ఆహారపదార్థాల ఫొటోలు తీయాలి

  • మధ్యాహ్న భోజనం బియ్యానికి మళ్లీ పాలిషింగ్‌

హైదరాబాద్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలను సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. తరచూ ఇలాంటి ఉదంతాలు బయట పడుతుండడంపై ఆగ్రహంగా ఉంది. నారాయణపేట జిల్లా మాగనూరు ఉన్నత పాఠశాలలో వారం వ్యవధిలోనే మూడుసార్లు.. మధ్యాహ్న భోజనం కలుషితం కావడం, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని చౌదరి శైలజ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మరణించడం వంటి ఘటనల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, గురుకులాలు, ఆస్పత్రుల్లో జరిగిన ఇలాంటి ఘటనలకు కారణాలు, బాధ్యులను గుర్తించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే..విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘సంస్థాగత ఆహార భద్రత కమిటీ’లను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఆహార పదార్థాలను రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాల్సి ఉంటుందని ఆదేశించింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, వారికి సురక్షితఆహారాన్ని అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు.


  • టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ఎవరెవరంటే..

కలుషిత ఆహార ఘటనలపై విచారణకు సర్కారు నియమించిన త్రిసభ్య టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో.. రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌, సంబంధిత విభాగాధికారి(హెచ్‌వోడీ)/అదనపు డైరెక్టర్‌, జిల్లా స్థాయి సంబంధిత శాఖ అధికారి (డీఎ్‌సడబ్ల్యూవో/డీటీడబ్ల్యూవో/డీబీసీడబ్ల్యూవో/డీఏఈ తదితరులు)లతో ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఆహార భద్రత కల్పించడంతోపాటు.. సంస్థాగత తనిఖీ యంత్రాంగాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో సర్కారు దీన్ని ఏర్పాటు చేసింది. కలుషిత ఆహార సంఘటనలు చోటు చేసుకున్న అన్ని హాస్టళ్లు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఈ కమిటీ సందర్శించి, విచారణ జరిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక సమర్పిస్తుంది.

  • ఆహార భద్రతా కమిటీల్లో ఎవరంటే..

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ‘సంస్థాగత ఆహార భదత్రా కమిటీ’ల్లో కూడా ముగ్గురు చొప్పున సభ్యులుంటారు. ప్రధానోపాధ్యాయుడు/వార్డెన్‌తో పాటు ఆ పాఠశాలలోని మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ప్రతి విద్యాలయం, పాఠశాలపై పర్యవేక్షణ కోసం ఒక మండల, డివిజన్‌, జిల్లా స్థాయి అధికారిని నియమించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.


  • ఆహార భద్రతా కమిటీలు చేయాల్సిన పనులు...

గురుకులాలు, హాస్టళ్లలో ఆహారాన్ని తయారు చేసే ప్రతి సందర్భంలోనూ ఈ కమిటీలు ముందస్తుగా స్టోర్‌ రూమ్‌లు, కిచెన్‌లను తనిఖీ చేయాలి. అవి శుభ్రంగా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాతే వండాలి.

  • విద్యార్థులకు వడ్డించే ముందు ఈ కమిటీలు ఆహార పదార్థాలను రుచి చూడాలి. అవి బాగున్నాయని, భద్రంగా ఉన్నాయని రూఢీ చేశాకే విద్యార్థులకు అందించాలి.

  • రోజూ స్టోర్‌ రూమ్‌లు, కిచెన్‌లు, ఆహార పదార్థాల ఫొటోలు తీయాలి. సంబంధిత నోడల్‌ శాఖలు వీటి కోసం ఒక యాప్‌ను తయారు చేయాలి. నిత్యం తీసిన ఫొటోలను రికార్డుల్లో భద్రపర్చాలి. మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చాక... ఆ ఫొటోలను రోజువారీగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

  • మళ్లీ పాలిషింగ్‌..

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్య పాలవుతున్న ఘటనల నేపథ్యంలో.. ఉచిత మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసిన బియ్యాన్ని మరోసారి పాలిషింగ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. సరైన నిల్వ ఏర్పాట్లు లేక.. చాలా చోట్ల బియ్యానికి పురుగులు పడుతున్నాయి. ఇలా చెడిపోయిన, పురుగులు పట్టిన బియ్యాన్ని ఉపయోగించడంతో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ బియ్యాన్ని మళ్లీ పాలిషింగ్‌ చేయాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్టు సమాచారం.


  • ఫామ్‌హౌస్‌ నుంచి కుట్ర మహిళా, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్ల ఆరోపణ

లగచర్ల, దిలావర్పూర్‌లో అధికారుల పై దాడులు, గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని మహిళ, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ల చైర్‌పర్సన్‌లు బండ్రు శోభారాణి, కల్వ సుజాత ఆరోపించారు. ‘ఫామ్‌హౌస్‌’ నుంచి కుట్రలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. విద్యాశాఖను సీఎం రేవంత్‌ చూస్తున్నందున ఆయన్ని అప్రదిష్ట పాలు చేయడానికే కుట్రలు జరుగుతున్నాయన్నారు. హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనల వెనుక ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కుట్ర ఉందని విమర్శించారు. ప్రవీణ్‌కుమార్‌, కేటీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 03:25 AM