Share News

Kodangal: లగచర్ల పారిశ్రామిక పార్కుపై.. సర్కారు దూకుడు!

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:23 AM

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళార్ధ సాధక పారిశ్రామికవాడ(మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌) ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

Kodangal: లగచర్ల పారిశ్రామిక పార్కుపై.. సర్కారు దూకుడు!

  • తాజాగా మరో నోటిఫికేషన్‌ జారీ

  • లగచర్ల, హకీంపేట గ్రామాల

  • పరిధిలో 643.34 ఎకరాల సేకరణ

  • తొలి నోటిఫికేషన్‌లో 182.31 ఎకరాలు

  • అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్‌ దృష్టికి..

  • పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు

  • 25 వేల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం

  • టీజీఐఐసీకి మౌలిక వసతుల బాధ్యతలు

  • ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల

వికారాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళార్ధ సాధక పారిశ్రామికవాడ(మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌) ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆదివారం మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. లగచర్ల, హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల భూమి సేకరించనున్నట్లుగా ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీంట్లో లగచర్లలో 497 ఎకరాలు, హకీంపేటలో 146.34 ఎకరాలు ఉన్నాయి. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో 182.31 ఎకరాలు సేకరించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాలున్నాయి. 2 నోటిఫికేషన్ల ద్వారా లగచర్ల, హకీంపేట్‌, పోలేపల్లి పరిధిలో మొత్తం 826.25 ఎకరాలు సేకరించనున్నారు. ఇంతకుముందు ఫార్మా విలేజ్‌లను ప్రతిపాదించిన లగచర్ల, హకీంపేట్‌, పోలేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోనే ఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో.. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటి స్థానంలో, పారిశ్రామిక పార్కు నిర్మాణం ప్రతిపాదనను తాజాగా ముందుకు తెచ్చింది. మల్టీపర్ప్‌సఇండస్ట్రియల్‌ పార్క్‌కు సేకరించనున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, భూ విస్తీర్ణం తదితర వివరాలను నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన అధికారిక ప్లాన్‌ ను రైతులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో చూడవచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌లో ఉన్న సర్వే నంబర్లలో ఏ భూమిలోకైనా ప్రవేశించి.. భూమిని సర్వే చేసి లెవెల్స్‌ తీసుకునేందుకు, బోరు వేయడం వంటి పను లు చేపట్టేందుకు తాండూరు సబ్‌ కలెక్టర్‌కు ప్రభుత్వం అఽధికారం కట్టబెట్టింది. నోటిఫికేషన్‌ జారీచేసిన నాటి నుంచి ఆ భూములపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదని.. అమ్మకాలు, కొనుగోళ్లు చేయరాదని, బ్యాంకుల్లో అప్పులు తీసుకోరాదని స్పష్టం చేశారు. భూసేకరణ, నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలు ఉంటే.. నోటిఫికేషన్‌ విడుదలైన 60 రోజుల్లోగా రైతులు కలెక్టర్‌ దృష్టికి తేవాలని పేర్కొన్నారు.


  • 25 వేల మందికి ఉద్యోగావకాశాలు

మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేయటం ద్వారా దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట తదితర గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్‌ పట్టుదలతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్స్‌టైల్‌ వంటి పరిశ్రమలు ఏర్పాటుచేసి కనీసం 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటును ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై ప్రభుత్వం దూకుడుగానే వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిం చే బాధ్యతను ప్రభుత్వం.. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీజీఐఐసీ)కు అప్పగించింది. భూసేకరణ ప్రక్రియ అనంతరం భూ ముల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపడతారు. భూములు కోల్పోనున్న వారికి నష్ట పరిహారంతోపాటు ఉపాధి, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సాధారణంగా భూసేకరణలో నిర్వాసితులకు నష్టపరిహారం, 125 గజాల నివాస స్థలం, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం వంటివి ఇస్తుంటారు. దుద్యాల మండలంలో నిర్మించనున్న మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో భూములు కోలోయే రైతులకు ప్రభుత్వం ఏ విధమైన పరిహారం, పునరావాసం కల్పించనుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


  • నేడు కోర్టుల ముందుకు పిటిషన్లు

వికారాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనలో వివిధ పక్షాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం కోర్టుల ముందుకు రానున్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కొడంగల్‌ జే ఎఫ్‌ఎంసీలో వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే అవకాశముంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ వికారాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు ముందు విచారణకు రానుంది. రైతులకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు వేసిన పిటిషన్లు కూడా జిల్లా కోర్టు ముందుకు రానున్నాయి.

Updated Date - Dec 02 , 2024 | 03:23 AM