కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు రశీదులు!
ABN , Publish Date - Nov 16 , 2024 | 03:42 AM
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదులు(ట్రక్ షీట్) అక్కడికక్కడే జారీ చేయాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకం వేయగానే. రైతుల సంతకం తీసుకొని రశీదు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
తూకం వేయగానే లెక్కలు తేల్చాలని ప్రభుత్వ ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదులు(ట్రక్ షీట్) అక్కడికక్కడే జారీ చేయాలనే నిబంధన కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తూకం వేయగానే. రైతుల సంతకం తీసుకొని రశీదు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతు ఎన్ని బస్తాల ధాన్యం తెచ్చారు? వాటి బరువు ఎంత? ఎన్ని డబ్బులు వస్తాయి? అనే వివరాలు రశీదుపై రాయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోనే రశీదులు జారీచేసేందుకు సెంటర్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ నిబంధన గతంలోనూ ఉన్నా రైస్‌మిల్లర్లు అనుమతిచ్చిన తర్వాతే రశీదులు జారీచేసేవారు. రైస్‌మిల్లర్లు ధాన్యం లోడెత్తుకొని, మిల్లుల్లో దిగుమతి చేసుకున్న తర్వాత, తరుగు, తాలు, కడ్తా అన్నీ లెక్కచూసుకొని పరిమాణంలో కోత పెట్టేవారు.
దీంతో రైతులకు క్వింటాలుకు బదులుగా 90 కిలోల ధాన్యానికే డబ్బులు వచ్చేవి. ఇకపై రైతుల అనుమతి లేనిదే కొనుగోలు కేంద్రం నుంచి లారీ లోడయ్యేదిలేదని, సెంటర్ నుంచి కదిలేది లేదని చెప్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్ల అతి జోక్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రభుత్వం సేకరించే ధాన్యానికి సంబంధించి రైతులకు, రైస్‌మిల్లర్లకు ఎలాంటి సంబంధం లేకుండా చేసింది. కేవలం బ్యాంకు గ్యారెంటీ గానీ, సెక్యూరిటీ డిపాజిట్ గానీ, ఒప్పందపత్రాలుగానీ రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. అప్పుడు రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా ధాన్యం కేటాయింపులు చేస్తారు. కేటాయించిన ధాన్యాన్ని ఆయా ప్రాంతంలో ఉండే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్‌మిల్లులకు పంపిస్తారు. ఆ ధాన్యాన్ని దించుకొని కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన బాధ్యత రైస్‌మిల్లర్లకు ఉంటుంది. అంతేతప్ప కొనుగోలు కేంద్రాల్లో జరిగే ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మిల్లులకు చేరిన ధాన్యాన్ని దిగుమతి చేసుకొని, మిల్లింగ్ చేసేవరకే మిల్లర్లను పరిమితం చేశారు.
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం సేకరణ
రాష్ట్రంలో శుక్రవారం నాటికి 10.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో దొడ్డు రకాలు 8.43 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకాలు 2.38 లక్షల మెట్రిక్ టన్నులు. 91.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 8,062 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా ఇప్పటివరకు 7,507 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో 4,153 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. మిగిలిన సెంటర్లకు ఎప్పుడు ధాన్యం వస్తే... అప్పుడు ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు 1.59 లక్షల మంది రైతుల నుంచి రూ. 2,509 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలుచేశారు.