Government hospitals: సర్కారీ కార్పొరేట్ ఆస్పత్రి!
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:25 AM
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది.
పీహెచ్‌సీ నుంచి బోధనాస్పత్రుల దాకా హంగులు
రోగులను సాదరంగా చేర్చుకుని.. చికిత్సకు చర్యలు
రిసెప్షన్, వైద్యుల గదులు, ల్యాబ్‌లు తెలిసేలా బోర్డులు
రోగులు గుర్తించేలా పీహెచ్‌సీ సబ్ సెంటర్లకు బ్రాండింగ్
పోర్టల్‌తో ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి.. ప్రైవేటులో అధ్యయనం
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ల నుంచి బోధనాస్పత్రుల దాకా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. ఆస్పత్రులకు వచ్చే రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారిని రిసీవ్ చేసుకునే ప్రక్రియ నుంచి వైద్య చికిత్స పూర్తిచేసుకొని ఇంటికి పంపేదాకా అన్ని దశల్లోనూ మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనపై అధ్యయనం కోసం కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ... ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పరిస్థితులు, అక్కడ రోగులకు అందుతున్న సేవలు, వైద్య సిబ్బంది తీరుపై అధ్యయనం చేసింది. ఆ మేరకు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను పరిశీలించి.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులను వివరిస్తూ సర్కారుకు ఓ నివేదిక అందజేసింది. దీని ఆధారంగా సర్కారు ఆస్పత్రికి వచ్చిన రోగికి వైద్య పరీక్షలు, చికిత్సపై భరోసా కల్పించేలా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రికి వచ్చే రోగులకు సమయం వృథా కాకుండా తక్షణమే వైద్య సేవలు అందేలా రిసెప్షన్ కౌంటర్లు, వైద్యుల గదులు, ల్యాబ్‌లు, క్యాంటిన్లు, అత్యవసర ద్వారాలను తేలిగ్గా గుర్తించేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో ఇన్‌పేషెంట్లుగా చేర్చుకునే వారు తక్షణమే అడ్మిట్ అయి, వెంటనే వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సర్కారు దవాఖానాల్లో మౌలిక సదుపాయాలనూ మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. కుర్చీలు మొదలు ఔషధాల వరకు అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది. అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు నిరుపేద రోగులు తొలుత ఆశ్రయించేది సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు-ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)నే! ఈ సబ్ సెంటర్లను ప్రజలు తేలిగ్గా గుర్తించేలా వీటికి బ్రాండింగ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ సెంటర్లను ప్రభుత్వం ఒకే తరహాలో ఉండేలా తీర్చిదిద్దనున్నదన్నమాట! ‘ఇది సర్కారు దవాఖానా’ అని ప్రజలు గుర్తించేలా సబ్ సెంటర్లకు ఒకే తరహా రంగులు వేసి బ్రాండింగ్ చేయనున్నారు.
సిబ్బందిపై ఫిర్యాదుకు బాక్స్‌లు
కిందిస్థాయి ఉద్యోగుల తీరు వల్లే ప్రభుత్వాస్పత్రులపై చెడ్డపేరు వస్తోందనే అభిప్రాయం సర్కారులో ఉంది. వారి ప్రవర్తన సరిగా ఉండటం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. రోగులను చీదరించుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం, అరవడంలాంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కిందిస్థాయి ఉద్యోగుల ప్రవర్తనా తీరులో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యశాఖ భావిస్తోంది. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే బాధితులు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సదరు ఆస్పత్రిలో ఫిర్యాదు పెట్టెలతో పాటు టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులో ఉంచనుంది.