Share News

Ponguleti : డిసెంబరులోగా నిరుపేదలకు పట్టాలు

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన నిరుపేదలకు డిసెంబరులోగా పాస్‌ పుస్తకాలు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Ponguleti : డిసెంబరులోగా నిరుపేదలకు పట్టాలు

  • సర్కారు భూములు సాగు చేసుకునే వారికి జారీ

  • నెలాఖరుకు 5.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

  • నియోజకవర్గానికి 3-4 వేల గృహాల కేటాయింపు: పొంగులేటి

ఆమనగల్లు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన నిరుపేదలకు డిసెంబరులోగా పాస్‌ పుస్తకాలు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాలలో డీఎంఎ్‌ఫటీ నిధులు రూ.1.18 కోట్లతో నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయ భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అనంతరం ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల పరిధిలోని 75 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను, 77 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.


దేశానికే ఆదర్శంగా, రైతుల భూములకు రక్షణ, భరోసా కల్పించేలా ప్రభుత్వం 2024లో కొత్త ఆర్‌వోఆర్‌ చట్టాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఈ చట్టాన్ని అమలు చేసి రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు అధునాతన సదుపాయాలతో నూతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు మొదటి విడతగా 5.50 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలతో పాటు ఇళ్లను రెండో విడతలో మంజూరు చేస్తామని చెప్పారు.

Updated Date - Oct 08 , 2024 | 04:04 AM