Alignment: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం పర్యవేక్షణకు ‘పీఐయూ’
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:52 AM
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్ సహా అన్ని పనుల పర్యవేక్షణకు ‘ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్’(పీఐయూ) ఏర్పాటు కానుంది.
త్వరలో డీపీఆర్ కన్సల్టెంట్ నియామకం
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణభాగం నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్ సహా అన్ని పనుల పర్యవేక్షణకు ‘ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్’(పీఐయూ) ఏర్పాటు కానుంది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని తన ఆధ్వర్యంలోనే నిర్మించాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐఏఎస్ అధికారులతో ఇప్పటికే ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దక్షిణభాగం రహదారి అలైన్‌మెంట్, ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు నిర్మించాల్సిన రేడియల్ రోడ్ల అలైన్‌మెంట్ల తయారీ బాధ్యత ఆ కమిటీకి అప్పగించింది. ఈ క్రమంలోనే అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు పీఐయూను ఏర్పాటు చేయాలని ఆ కమిటీ నిర్ణయించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు కూడా అప్పట్లో పీఐయూను ఏర్పాటు చేశారు.
ఓఆర్‌ఆర్ నిర్మాణం మొత్తాన్ని పీఐయూనే పర్యవేక్షించింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం విషయంలోనూ పీఐయూ అంతే కీలకంగా పని చేస్తుందని కమిటీ యోచన. ఈ పీఐయూలో ఒక ప్రాజెక్టు మేనేజర్, చీఫ్ ఇంజనీర్(సీఈ), డిప్యూటీ ఇంజనీర్(డీఈ), సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ), ఒక మేనేజర్, ఒక అకౌంటెంట్ సహా అవసరమైన సిబ్బంది ఉండనున్నారు. ఇక దక్షిణ భాగానికి సంబంధించిన రహదారి నిర్మాణం, మార్గమధ్యలో నిర్మించే వెహికల్ అండర్ పాస్‌లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్ల వివిధ అంశాలన్నిటినీ తేల్చేందుకు ఓ డీపీఆర్ కన్సల్టెంట్‌ను నియామించాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.
ఇందుకు త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఫోర్త్ సిటీ, ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, బెంగళూరు హైవేల్లో అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతమున్న రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుప్పల్ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం కానుంది.