Hyderabad: బహుజనుల తల్లిగా..
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:05 AM
17 అడుగుల ఎత్తు, చేతిలో బతుకమ్మతో తెలంగాణతనం ఉట్టిపడేలా ‘తెలంగాణ తల్లి విగ్రహం’ దర్శనమివ్వనుంది.
తెలంగాణతనం ఉట్టిపడేలా విగ్రహం రూపకల్పన
5 నెలల పాటు శ్రమించిన జేఎన్‌ఏఎ్‌ఫఏయూ ఆచార్యులు
రేవంత్ ఆలోచనలకు తగ్టట్లు డిజైన్
పనులను పరిశీలించిన సీఎం
హైదరాబాద్/ అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): 17 అడుగుల ఎత్తు, చేతిలో బతుకమ్మతో తెలంగాణతనం ఉట్టిపడేలా ‘తెలంగాణ తల్లి విగ్రహం’ దర్శనమివ్వనుంది. 3 అడుగుల ఎత్తులో ఉన్న గద్దెపై 17 అడుగుల విగ్రహం కలిపి మొత్తం 20 అడుగుల ఎత్తులో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 9న లక్ష మంది మహిళలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విగ్రహానికి చిన్న చిన్న మెరుగులు దిద్దుతున్నారు.
తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం కోసం రూ.1.16 కోట్లను ఖర్చు చేస్తుండగా వాటర్ ఫౌంటెయిన్‌లు, లైటింగ్, పచ్చిక బయళ్లు సహా మొత్తం నిర్మాణానికి రూ.5.20 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ పనులను గురువారం సీఎం పరిశీలించి అఽధికారులకు సూచనలు చేశారు. విగ్రహ నమూనాలను రూపొందించే బాధ్యతలను జవహర్‌లాల్ నెహ్రూ అర్కిటక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (జేఎన్‌ఏఎ్‌ఫఏయూ)కు సీఎం అప్పగించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా డిజైన్‌ను రూపొందించినట్లు రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ చెప్పారు. బహుజనుల తల్లిగా, ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా విగ్రహం ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన డిజైన్ మేరకు పెద్దఅంబర్‌పేట్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన సాంకేతిక బృందం ఐదు నెలలు పాటు శ్రమించి విగ్రహాన్ని తయారు చేసిందని చెప్పారు.