ఆస్పత్రుల్లో అత్యవసర పరికరాల జాబితాను రూపొందించండి: దామోదర
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:05 AM
అత్యవసర ఔషధాల జాబితా మాదిరిగానే ఆస్పత్రుల్లో వినియోగించే అత్యవసర పరికరాల జాబితాను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఔషధాలు, పరికరాల పర్యవేక్షణకు సెంట్రల్ పోర్టల్
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అత్యవసర ఔషధాల జాబితా మాదిరిగానే ఆస్పత్రుల్లో వినియోగించే అత్యవసర పరికరాల జాబితాను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. డయాగ్నొస్టిక్ ఎక్వి్‌పమెంట్, ఫైర్ సేఫ్టీ, ఔషధాలు తదితర అంశాలపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో గురువారం మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో ఫైర్ సేఫ్టీ, పరికరాలు, ఔషధాల లభ్యతపై ఏర్పాటు చేసిన పది టాస్క్‌ఫోర్స్ బృందాలు నివేదికలను రూపొందించాయి. ఈ బృందాలు గుర్తించిన అంశాలను మంత్రికి వివరించారు.
పరికరాల మరమ్మతులు, ఔషధాల సరఫరా తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని బోధనాస్పత్రుల వరకు ఈ సమీకృత పర్యవేక్షణ వ్యవస్థ పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఔషధాలు, పరికరాల పర్యవేక్షణ కోసం త్వరలో సెంట్రల్ పోర్టల్ అందుబాటులోకి రానుందని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు ఏపీకి వెళ్లాయని, ఈ పదేళ్లలో బయోమెడికల్ ఇంజనీర్లను నియమించకపోవడంతో చిన్నచిన్న మరమ్మతుల కోసం పరికరాలను బయటకు పంపాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర స్థాయిలో చీఫ్ బయోమెడికల్ ఇంజనీర్ పోస్టును సృష్టించాలని మంత్రి చెప్పారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక బయోమెడికల్ ఇంజనీర్‌ను తాత్కాలిక పద్ధతిలో తక్షణమే నియమించాలని ఆదేశించారు.