High Court: అధీన ధ్రువపత్రం ఇచ్చే అధికారం వారికెక్కడిది?
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:20 AM
ఫలానా వ్యక్తి అధీనంలో ఫలానా వ్యవసాయ భూమి ఉందని పేర్కొంటూ అధీన లేదా అనుభవ లేదా కబ్జా ధ్రువీకరణ పత్రం జారీ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
సివిల్ కోర్టుదే ఆ అధికారం : హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఫలానా వ్యక్తి అధీనంలో ఫలానా వ్యవసాయ భూమి ఉందని పేర్కొంటూ అధీన లేదా అనుభవ లేదా కబ్జా ధ్రువీకరణ పత్రం జారీ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు అధీన ధ్రువపత్రం(పొజెషన్) జారీ చేసేలా ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్వోఆర్ యాక్ట్(తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్-2020) రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాన్ని కట్టబెట్టలేదని స్పష్టం చేసింది. సంబంధిత సివిల్ కోర్టుకు తప్ప హైకోర్టు, సుప్రీంకోర్టుకు సైతం అధీన ధ్రువపత్రం జారీ చేసే అధికారం లేదని.. తహసీల్దార్ నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కూడా అధీన ధ్రువపత్రం జారీ చేయలేరని తెలిపింది.
భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట్‌లోని 122వ సర్వే నంబరులో ఉన్న రెండెకరాల భూమికి జిల్లా కలెక్టర్ అధీన ధ్రువపత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్.మల్లయ్య తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. చట్టప్రకారం అసలు అధీనపత్రం జారీచేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించింది. వివాదంలో ఉన్న భూ లావాదేవీలపై స్టేట్‌సకో విధించింది. ఏ అధికారంతో అధీన పత్రం జారీ చేశారో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను డిసెంబరు 9కి వాయిదా వేసింది.