Share News

High Court: బీసీల లెక్కల కోసం ప్రత్యేక కమిషన్‌ను నియమించండి

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:14 AM

తెలంగాణలో బీసీల జనాభా లెక్కలు తీసేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో విచారణ చేపట్టడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్‌ కమిషన్‌ను రెండు వారాల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court: బీసీల లెక్కల కోసం ప్రత్యేక కమిషన్‌ను నియమించండి

  • స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు అది తప్పనిసరి: హైకోర్టు

  • బీసీ కమిషన్‌కు అప్పగించడం చెల్లదంటూ ఆర్‌.కృష్ణయ్య పిటిషన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీల జనాభా లెక్కలు తీసేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో విచారణ చేపట్టడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్‌ కమిషన్‌ను రెండు వారాల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక కమిషన్‌ తప్పనిసరి అని పేర్కొంది. బీసీల జనాభాను లెక్కించే పనిని బీసీ కమిషన్‌కు అప్పగించడం చెల్లదని.. ఇందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అంగీకరించవని పేర్కొంటూ మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సూరేపల్లి నంద ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్‌ను డెడికేటెడ్‌ కమిషన్‌గా గుర్తిస్తూ సెప్టెంబరు 6న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 199 చెల్లదని పేర్కొన్నారు.


బీసీ కమిషన్‌ను డెడికేటెడ్‌ కమిషన్‌గా గుర్తించడం ఆర్టికల్‌ 243(డీ), 243(టీ)కి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే ‘డాక్టర్‌ కే కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’, ‘వికాస్‌ కిషన్‌రావు గవాలి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’పై సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఏకకాలంలో కచ్చితమైన, శాస్త్రీయమైన లెక్కలు తీయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీసీ కమిషన్‌ బీసీల లెక్కలు తీసే పనిని ప్రారంభించిన నేపథ్యంలో దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఏకకాలంలో శాస్త్రీయ పద్ధతిలో కచ్చితమైన బీసీల లెక్కలు తీసేందుకు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా డెడికేటెడ్‌ కమిషన్‌ను రెండు వారాల్లో ఏర్పాటు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - Oct 31 , 2024 | 03:15 AM