హౌసింగ్, దిల్ భూముల చుట్టూ ప్రహరిగోడ
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:47 AM
తెలంగాణ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ (దిల్) పరిధిలోని భూములను ఆక్రమణల నుంచి కాపాడుకోవడానికి వాటి చుట్టూ హౌసింగ్ బోర్డుశాఖ ప్రహరిగోడను నిర్మిస్తోంది.
అధికారులతో సమీక్షించిన హౌసింగ్‌శాఖ కమిషనర్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ (దిల్) పరిధిలోని భూములను ఆక్రమణల నుంచి కాపాడుకోవడానికి వాటి చుట్టూ హౌసింగ్ బోర్డుశాఖ ప్రహరిగోడను నిర్మిస్తోంది. ఈ పనుల నిర్వహణకు రూ.25కోట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, హౌసింగ్ బోర్డు ఇప్పటికే మొదటి దశలో 16 ప్యాకేజీల కింద రూ. 10కోట్లతో తన పరిధిలోని 422 ఎకరాల్లో ప్రహరిగోడ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇక దిల్ పరిధిలోనూ ఆక్రమణలు, లిటిగేషన్‌లు లేని 620 ఎకరాల చుట్టూ గోడలను నిర్మించాలని నిర్ణయించగా, వీటిని 17 ప్యాకేజీలుగా విభజించింది. వీటి నిర్మాణానికి రూ.12 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. కాగా, ఇదే అంశంపై హౌసింగ్‌శాఖ కమిషనర్, హౌసింగ్ బోర్డు స్పెషల్ సెక్రటరీ వి.పి.గౌతమ్ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు భూముల చుట్టూ నిర్మిస్తున్న ప్రహరిగోడల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.