ROR: ప్రతి కమతానికీ భూధార్!
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:52 AM
రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్).. భూమి హక్కుల రికార్డు. తెలంగాణలో 1948 నుంచి 2024 వరకు నాలుగు పర్యాయాలు ఆర్వోఆర్‌లో మార్పులు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి-2024 పేరిట కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు
తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం
మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు
క్రిమినల్ కేసులు.. సర్వీసు నుంచి తొలగింపు
సులభంగా మ్యుటేషన్.. పాస్ పుస్తకాల జారీ
రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే
భూ భారతి-24 ఆర్వోఆర్ చట్టం ప్రత్యేకతలివీ
స్వాతంత్య్రం తర్వాత 4వ సారి మార్పు
ధరణి లోపాలను సరిదిద్దుతూ పలు చర్యలు
హైదరాబాద్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్).. భూమి హక్కుల రికార్డు. తెలంగాణలో 1948 నుంచి 2024 వరకు నాలుగు పర్యాయాలు ఆర్వోఆర్‌లో మార్పులు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి-2024 పేరిట కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూమి హక్కుల రికార్డును రూపొందించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, హక్కుల రికార్డుల్లో తప్పులు, మ్యుటేషన్, భూమిపై హక్కులు కట్టబెట్టే సమయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకపోవడం వంటి కారణాలతో తరచూ చట్టాలను మార్చుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి నిజాం హయాంలో బ్రిటీష్ అధికారుల సూచనలతో ఆర్వోఆర్ మొదలైంది. ఈ క్రమంలో వచ్చినవే ఖాస్రా పహాణి, 1బీ రిజిస్టార్/ఆర్వోఆర్ 1బీ, ధరణి, భూభారతి. హైదరాబాద్‌లో 1948లో చేసిన హక్కుల రికార్డునే ఖాస్రాపహాణిగా పరిగణించేవారు. ఆ తరువాత ఉమ్మడి ఏపీలో 1971లో చేసిన ఆర్వోఆర్ చట్టమే 1బీ రిజిస్టర్. ఈ 1బీ రిజిస్టర్ ఆధారంగానే 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. అనంతరం ధరణి-2020 తీసుకొచ్చారు. తాజాగా ధరణిలో లోపాలను సవరించేందుకు భూభారతి-2024ను తెచ్చారు. కాగా, 1948 చట్టంలో భూమి కలిగిన వారు, అనుభవదారులు, యజమానులు తనఖాదారులు, శిస్తు చెల్లింపుదారుల వివరాలు, ఎంత భూమి ఉంది, దాన్ని ఎలా కలిగి ఉన్నారు, హక్కులపై ఉన్న షరతులు, శిస్తు వివరాల కాలమ్స్‌ను పొందుపరిచారు. 1971 చట్టం ప్రకారం యజమాని, పట్టాదారు, తనకాదారు, అనుభవదారు, కౌలుదారుపేర్లు, వారికి ఉన్న భూమి వివరాల కాలమ్స్‌ను పొందుపరిచారు.
2020 చట్టంలో పట్టాదారు పేరు, భూమి ఉన్న సర్వే నంబరు, విస్తీర్ణం, ఇతర వివరాలతో కాలమ్స్ ఉండగా.. 2024 భూ భారతిలో యజమాని, అనుభవదారు, తనఖాదారు పేర్లు, వారికి ఉన్న భూమి వివరాలు, ఆ భూమి ఎలా సంక్రమించింది, హక్కులపై ఉన్న షరతులు, భూమి శిస్తు వివరాల కాలమ్స్‌ను ప్రవేశపెట్టారు. 1948లో ఆర్వోఆర్ చట్టం రూపొందించేటప్పుడు వ్యవసాయ భూముల సెన్సెస్ నిర్వహించి ఖాస్రాపహాణి హక్కుల రికార్డును ప్రకటించారు. 1971లో భూ యజమానుల నుంచి దరఖాస్తులు తీసుకుని, గ్రామ సభల ద్వారా 1బీ రిజిస్టర్ తయారు చేశారు. 2020లో 1971 నాటి 1బీ రిజిస్టర్‌నే ఆర్వోఆర్‌గా స్వల్ప మార్పులతో ప్రకటించారు. కొత్తగా హక్కుల రికార్డు రూపొందించలేదు. 2024 చట్టంలో మాత్రం రిజిస్ట్రేషన్ సందర్భంగా చేపట్టే సర్వే ఆధారంగా కొత్త హక్కుల రికార్డును రూపొందించే అవకాశం కల్పించారు.
తప్పుల సవరణ ఇలా?
1948 చట్టం ప్రకారం రెండేళ్ల గడువులోగా తప్పులు గుర్తిస్తే ప్రభుత్వం నిర్ధేశించిన అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. 1971 చట్టం ప్రకారం ఏడాది గడువు లోపల ప్రభుత్వం నిర్దేశించిన అధికారికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. 2020 చట్టంలో హక్కుల రికార్డు సవరణకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 2024 చట్టంలో ఏడాది లోపల దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. తహసీల్దార్ స్థాయిలో తప్పు జరిగితే ఆర్డీవోకు, ఆర్డీవో స్థాయిలో పొరపాటు జరిగితే కలెక్టర్‌కు, అక్కడ కూడా పొరపాటు జరిగితే ల్యాండ్ ట్రైబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యుటేషన్‌లోనూ మార్పులు
1948 ఆర్వోఆర్ చట్టం ప్రకారం వారసత్వ భూమిపై హక్కుల కోసం మూడు నెలల వ్యవధిలో పట్వారీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆయన ఆ వివరాలను మ్యుటేషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ రిజిస్టర్‌ను తహసీల్దారు, ఆపై స్థాయి అధికారి పరిశీలించిన తరువాత హక్కుల రికార్డులోకి ఎక్కిస్తారు. రిజిస్ర్టేషన్ ద్వారా హక్కులు సంక్రమిస్తే మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవసరం లేదు. 1971 ఆర్వోఆర్ ప్రకారం వారసత్వ భూమిపై హక్కుల కోసం నెల వ్యవధిలో తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్టర్ దస్తావేజు ద్వారా హక్కులు సంక్రమించినప్పుడు రిజిస్ర్టేషన్ అధికారి తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వాలి. తహసీల్దార్ వాటిని పరిశీలించి.. హక్కుల రికార్డులో నమోదు చేస్తారు. 2020 ఆర్వోఆర్ ప్రకారం కొనుగోలు, దానం, తనఖా, బదిలీ ద్వారా హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ర్టేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేస్తారు. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ ఒకేసారి జరిగిపోతుంది. వారసత్వంగా భూమి వస్తే వారసులు సంయుక్త ప్రకటన రాసుకుని తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే.. రికార్డుల్లో మార్పు చేస్తారు. 2020 చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేదు. కోర్టును ఆశ్రయించాల్సిందే. 2024 చట్టం ప్రకారం కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగ పంపకాల ద్వారా హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ర్టేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేస్తారు. ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతుంది. వారసత్వ భూమిపై హక్కుల కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే రికార్డుల్లో నమోదు చేస్తారు. నిర్ణీత వ్యవధిలో మ్యుటేషన్ చేయకపోతే ఆటోమేటిక్‌గా అవుతుంది. కోర్టు తీర్పు, లావోణీ పట్టా, 38ఈ, 13బీ సర్టిఫికెట్, ఓఆర్‌సీ, సేల్ సర్టిఫికెట్ ద్వారా హక్కులు సంక్రమిస్తే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే హక్కుల రికార్డులో మార్పు చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాటి నుంచి భూముల రిజిస్ర్టేషన్, మ్యుటేషన్ జరగడానికి భూమి పటం తప్పనిసరి చేశారు. తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీవోకు, ఆర్డీవో ఉత్తర్వులపై కలెక్టర్ లేదా జేసీలకు అప్పీల్ చేసుకోవచ్చు. వీరి తీర్పులపై భూ ట్రైబ్యునల్‌కు రివిజన్ అధికారాలు ఇచ్చారు.
ప్రతి కమతానికి విశిష్ట గుర్తింపు
గతంలో ఏ చట్టంలోనూ ఈ అంశాన్ని పొందుపర్చలేదు. డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణలో భాగంగా భూ కమతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. 2024 చట్టంలో ప్రతి భూ కమతానికి తొలుత తాత్కాలిక భూధార్ నంబర్ ఇచ్చి, సర్వే చేసిన తరువాత శాశ్వత భూధార్ ఇచ్చేలా ప్రతిపాదించారు. 1948లో హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ మాత్రమే ఇచ్చే వారు. కోర్టులో ఏదైనా కేసు నమోదు చేయాలంటే హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ తప్పనిసరి. 1971 చట్టం ప్రకారం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే పట్టాదార్ పాస్‌పుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఇచ్చేవారు. 2020 చట్టంలో పట్టాదార్ పాస్‌పుస్తకం కమ్ టైటిల్ డీడ్/ భూ యాజమాన్య హక్కు పత్రం ఇచ్చారు. 2024 చట్టం ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకం కమ్ టైటిల్ డీడ్/ భూ యాజమాన్య హక్కు పత్రం ఇస్తారు. దీంతోపాటు భూధార్ ఇవ్వనున్నారు. పాస్‌పుస్తకాలకు రిజిస్టర్ దస్తావేజుకు ఉన్న విలువే ఉంటుంది. హక్కుల రికార్డు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు పొందవచ్చు.
రైతులకు మేలు చేయనుంది
భూభారతి-2024 చట్టం ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది రైతులకు మరింత మేలు చేసే అవకాశం ఉంది. భూ సమస్యలకు పరిష్కారం చూపనుంది. ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మార్గదర్శకాలతో అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వనుంది. తద్వారా 2020 చట్టం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు మంచి జరుగుతుంది. ఆర్వోఆర్ చట్టం ప్రధాన ఉద్దేశం నెరవేరుతుంది.
- సునీల్, భూ చట్టాల నిపుణుడు
అధికారులపై చర్యలుంటాయా?
1948, 1971 చట్టాల ప్రకారం రికార్డుల్లో సవరణలు చేసిన ప్రభుత్వ అధికారిపై ఎలాంటి చర్యలకు తావు లేదు. 2020 చట్టం ప్రకారం రికార్డుల్లో సవరణలు చేసినా.. తొలగించినా ప్రభుత్వ అధికారిపై కేసు నమోదుకు అవకాశం లేదు. రికార్డులు ట్యాంపర్ చేసినా, మోసపూరిత చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. ప్రభుత్వ భూములకు పాస్‌పుస్తకాలు ఇస్తే కలెక్టర్ రద్దు చేయవచ్చు. 2024 చట్టం ప్రకారం రికార్డుల నమోదు, సవరణ చేపట్టే అధికారిపై ఎలాంటి కేసు పెట్టేందుకు వీలు లేదు. రికార్డులు ట్యాంపర్ చేసినా, మోసపూరిత చర్యలకు పాల్పడినా క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంది. సర్వీస్ నుంచి తొలగించవచ్చు. ప్రభుత్వ భూములకు పాస్‌పుస్తకాలు ఇస్తే కలెక్టర్ రద్దు చేయవచ్చు. తహసీల్దార్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు.