Share News

Medical Recruitment: వైద్య శాఖలో నియామకాల జోరు

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:25 AM

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దూకుడుగా పని చేస్తోంది. ఒక దాని తర్వాత మరొకటి.. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ రాత పరీక్షలు నిర్వహిస్తూ నియామకాలు పూర్తి చేస్తోంది.

Medical Recruitment: వైద్య శాఖలో నియామకాల జోరు

  • 11 నెలల్లో 7 వేలకు పైగా పోస్టుల భర్తీ

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల జాబితా విడుదల

  • రేపు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

  • త్వరలో 640 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు దూకుడుగా పని చేస్తోంది. ఒక దాని తర్వాత మరొకటి.. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ రాత పరీక్షలు నిర్వహిస్తూ నియామకాలు పూర్తి చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో ఏడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. సెప్టెంబరులో మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న మెడికల్‌ బోర్డు త్వరలో మరిన్ని నోటిఫికేషన్ల జారీకి సిద్ధంగా ఉందని అంటే దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 435 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎ్‌స)ల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా ఆదివారం విడుదలైంది. జాబితాలో చోటు దక్కించుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన వెంగళరావునగర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో మంగళవారం(19న) జరగనుంది. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం ఎంపికైన వైద్యులకు ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందించేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది.


  • 640 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌

సీఏఎస్‌ వైద్యుల నియామక ప్రక్రియ పూర్తి కాగానే వైద్య విద్య సంచాలకుల పరిఽధిలోని 640కి పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీతో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత కొంతమేరకు తగ్గనుంది. ఈ నోటిఫికేషన్‌ తర్వాత తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో స్పెషలిస్టు వైద్యుల నియామకం ఉండనుంది. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ప్రస్తుతం 1600 పైచిలుకు స్పెషలిస్టు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ ఖాళీ పోస్టుల్లో ఇప్పటికే 800 మంది స్పెషాలిటీ వైద్యులు ప్రస్తుతం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీళ్లలో కొందరిని రెగ్యులరైజ్‌ చెయ్యాల్సి ఉంది. రెగ్యులరైజేషన్‌ ముగిసిన తర్వాత మిగిలిన, ఖాళీగా ఉన్న పోస్టులకు కలిపి ఒకే నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది.


  • ఒకే నెలలో మూడు నోటిఫికేషన్లు

మెడికల్‌ బోర్డు గత నాలుగు నెలల్లో 4 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మూడు సెప్టెంబరులోనే విడుదల కావడం గమనార్హం. సెప్టెంబరు 11న 1284 ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టులకు, 18న 2322 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు, 24న 633 ఫార్మసిస్టు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ల్యాబ్‌ టెక్నిషియన్ల రాతపరీక్ష ఇప్పటికే పూర్తవగా, నర్సు పోస్టుల రాత పరీక్ష ఈ నెల 23న జరగనుంది. ఈ పోస్టులతో పాటు 156 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎంఎన్‌జే) పోస్టులు, 24 ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇక, గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎంపిహెచ్‌ఏ ఫీమేల్‌ పోస్టులకు డిసెంబరు 29న రాత పరీక్ష నిర్వహించనున్నారు.


  • దళారులను నమ్మకండి: మంత్రి రాజనర్సింహ

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని వైద్య, ఆరోగ్య శాఖ దామోదర రాజ నర్సింహ ఆదివారం సూచన చేశారు. మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా దళారులు తారసపడితే అభ్యర్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు.

Updated Date - Nov 18 , 2024 | 04:25 AM