TGSPDCL : విద్యుత్తు కొనుగోళ్లపై నిషేధం!
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:45 AM
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు గత ప్రభుత్వ నిర్వాకంతో షాక్ తగిలింది.
261 కోట్లు చెల్లించలేదని గ్రిడ్ కంట్రోలర్ చర్యలు
హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యుత్తు సంస్థ
స్టే విధించిన న్యాయస్థానం
ఛత్తీ్‌సగఢ్ విద్యుత్తు కొనుగోలులో గత ప్రభుత్వ నిర్వాకంతోనే..
హైకోర్టును ఆశ్రయించిన ఎస్పీడీసీఎల్
పవర్‌గ్రిడ్ ఉత్తర్వులపై స్టే విధించిన కోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)కు గత ప్రభుత్వ నిర్వాకంతో షాక్ తగిలింది. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం డిస్కమ్‌కు శాపంలా మారింది. ఛత్తీ్‌సగఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటామని కారిడార్ బుక్ చేసుకున్న తర్వాత, అవసరం లేదని పేర్కొన్న కేసులో రూ.261.31 కోట్లను ఎస్పీడీసీఎల్ చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డీసీ)కు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎన్‌ఎల్‌డీసీ బహిరంగ విపణిలో ఎస్పీడీసీఎల్ విద్యుత్తు క్రయవిక్రయాలపై గురువారం ఉదయం నిషేధం విధించింది. గత ప్రభుత్వం ఛత్తీ్‌సగఢ్‌లోని మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్లు, అదనంగా మరో 1000 మెగావాట్ల కోసం పవర్‌గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
విద్యుత్తు చెల్లింపుల వివాదంతో మార్వా ప్లాంట్ నుంచి 1000 మెగావాట్ల కరెంట్ ఆగిపోగా.. అదనంగా తీసుకుంటామని చెప్పిన 1000మెగావాట్లపై బీఆర్‌ఎస్ సర్కారు వెనక్కి తగ్గింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తితో లైన్లు వేసినప్పటికీ వినియోగించుకోకుండా వదిలేసినందున చార్జీల కింద రూ.261.31కోట్లు చెల్లించాలంటూ మార్చి 12న పవర్ గ్రిడ్ తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీకి బిల్లును పంపింది. దీనిపై కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)లో టీజీఎస్పీడీసీఎల్ పిటిషన్ వేసింది. ఈ కేసులో వాదనలు జరగాల్సి ఉండగా.. ‘గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా’కు పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది. దీంతో బహిరంగ విపణిలో కరెంట్ కొనుగోళ్లకు అవకాశం లేకుండా కట్టడి చేస్తూ బుధవారం ప్రాప్తి (పేమెంట్ రాటిఫికేషన్ ఇన్ పవర్ ప్రొక్యూర్‌మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ఇన్‌వాయింసింగ్ ఆఫ్ జనరేటర్స్) పోర్టల్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ఆధారంగా గురువారం ఉదయం నుంచి కరెంట్ కొనుగోళ్లు నిలుపుదల చేసింది. విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వెంటనే హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయాలని ఆదేశించారు. సీఎం సూచనలతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.
స్టే విధించిన హైకోర్టు
చార్జీల కేసు సీఈఆర్‌సీలో పెండింగ్‌లో ఉండగా కఠిన చర్యలు చేపట్టడం అక్రమమని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని పేర్కొంటూ టీజీఎస్పీడీసీఎల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. డిస్కం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ వద్ద కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రతివాదులు లేట్ పేమెంట్ సర్‌చార్జి నిబంధనల కింద పిటిషనర్‌ను డీఫాల్టర్ జాబితాలో పెట్టడం అక్రమమని తెలిపారు. పిటిషనర్ విద్యుత్తు కొనుగోళ్లలో పాల్గొనేలా అనుమతించాలని కోరారు. పవర్‌గ్రిడ్, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు నోటీసు ఇచ్చి ఆరు నెలలైనాస్పందించకపోవడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఇదే తరహా వివాదంలో 25శాతం చార్జీలు చెల్లిస్తే విద్యుత్తు కొనుగోళ్లకు అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందని తెలిపారు. పిటిషనర్ కూడా రూ.261 కోట్లలో 25 శాతం చెల్లిస్తే పవర్ ట్రేడింగ్‌కు అనుమతిస్తామని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ‘ఇది రాష్ట్రంలోని కోట్లాది మందికి విద్యుత్తు సరఫరాకు సంబంధించిన అంశం. సరఫరా నిలిచిపోతే ఇబ్బందులొస్తాయి. ఇతర వనరులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సొంతంగా విద్యుదుత్పత్తి చేసుకోగలుగుతోంది. రాష్ట్రానికి కారిడార్ అవసరం లేకపోయి ఉండొచ్చు’అని పేర్కొంది. చార్జీల వివాదం సెంట్రల్‌కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉండగా విద్యుత్తు కొనుగోళ్లు చేయకుండా పిటిషనర్‌ను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది.
ప్రాప్తి పోర్టల్ ద్వారా జారీచేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. పిటిషనర్‌ను విద్యుత్తు క్రయవిక్రయాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంటూ విచారణను అక్టోబరు 17కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని వెంటనే ప్రతివాదులకు తెలియజేయాలని ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెంట్రల్ ట్రాన్సిమిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజ్, కేంద్ర విద్యుత్తు శాఖకు నోటీసులు జారీచేసింది.