Share News

TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:47 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అంబులెన్స్‌ల తరహాలో ప్రత్యేక వాహనాలను టీజీఎస్పీడీసీఎల్‌ అందుబాటులోకి తెచ్చింది.

TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

  • హైదరాబాద్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి అంబులెన్స్‌ల తరహాలో ప్రత్యేకంగా వాహనాలు

  • ఒక్కో వాహనంలో ఏఈ సహా ముగ్గురు సిబ్బంది

  • థర్మో విజన్‌ కెమెరాలతోపాటు భద్రతా పరికరాలు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అంబులెన్స్‌ల తరహాలో ప్రత్యేక వాహనాలను టీజీఎస్పీడీసీఎల్‌ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం డయల్‌-1912 నూతన వాహనాలను డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అంబులెన్స్‌ తరహాలో ఈ వాహనాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. సీబీడీ(సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌) విభాగాన్ని పటిష్టపరుస్తూ ప్రతి డివిజన్‌లో ప్రత్యేక వాహనం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.


వినియోగదారులు 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది పరికరాలతో అక్కడకు చేరుకొని విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపడుతారని తెలిపారు. ప్రతి వాహనంలో అవసరమైన మెటీరియల్‌తోపాటు ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌, ముగ్గురు లైన్‌ సిబ్బంది 24 గంటలు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ వాహనాల్లో థర్మో విజన్‌ కెమెరాలు, పవర్‌ రంపం మిషన్‌, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్‌ వంటి భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిలైతే.. అక్కడకు తక్కువ సమయంలో తరలించడానికి, పాత ట్రాన్స్‌ఫార్మర్‌ మార్చేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. టీజీ ఎయిమ్స్‌ యాప్‌తో అనుసంధానం చేయడం ద్వారా వాహనం ఎక్కడ ఉంది? ఎన్ని నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటుందనే వివరాలు అధికారులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది.

Updated Date - Oct 22 , 2024 | 04:47 AM