Thummala: పత్తి, పచ్చిరొట్ట విత్తనాలకు ప్రత్యేక కౌంటర్లు..
ABN , Publish Date - May 31 , 2024 | 03:26 AM
పత్తి, పచ్చిరొట్ట విత్తనాలకోసం రైతులు ఒకేచోటకు అఽధిక సంఖ్యలో వస్తే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విత్తనాల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు.
పంపిణీ సజావుగాచేసే బాధ్యత కలెక్టర్లదే
అందుబాటులో 68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు
ఒకే కంపెనీ విత్తనాల్ని కోరడంతోనే సమస్య
అధికారులు నిత్యం విక్రయ కేంద్రాలను
తనిఖీ చేయాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): పత్తి, పచ్చిరొట్ట విత్తనాలకోసం రైతులు ఒకేచోటకు అఽధిక సంఖ్యలో వస్తే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విత్తనాల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తుమ్మల మాట్లాడారు. జిల్లాల వారిగా ఇప్పటివరకు 68,16,967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన ప్యాకెట్లు కూడా జూన్ 5 నాటికి జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం పత్తి విత్తనాల విక్రయకేంద్రాలను పరిశీలించాలని సూచించారు. జీలుగ, జనుము విత్తనాలను సరఫరాచేసే కేంద్రాలను కూడా తనిఖీలు చేయాలని ఆదేశించారు.
విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా కొరతలేకుండా ప్రణాళిక చేసుకోవాలని మంత్రి సూచించారు. గత వారంలో కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని.. విత్తన కంపెనీల ప్రతినిధులు జూన్ ఐదో తేదీ వరకు పత్తి విత్తన ప్యాకెట్లను క్షేత్రస్థాయికి చేర్చాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాతోపాటు కొన్నిజిల్లాల్లో ఒకే కంపెనీకి చెందిన విత్తనాలను రైతులంతా కోరటంతోనే సమస్య ఎదురవుతున్నదన్నారు. యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న పత్తి విత్తనాలు, హైబ్రీడ్ విత్తనాల దిగుబడి ఒక్కటేన న్నారు. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రోజూ జిల్లావారిగా, కంపెనీలవారిగా పత్తి విత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాల నివేదికలు పరిశీలిస్తున్నామని తెలిపారు. పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతలేదని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. ప్రభుత్వామోదిత దుకాణాల నుంచి విత్తనాలు కొనాలని, బిల్లులు భద్రపరుచుకోవాలని ఆయన సూచించారు.
విత్తనాల కొరత లేదు.. ప్రతిపక్షాలది దుష్ప్రచారం: చిన్నారెడ్డి
రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవ్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ జి.చిన్నారెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఖరీ్‌ఫలో పండించాల్సిన పంటలు, ప్రభుత్వ సన్నద్ధతపై గురువారం మంత్రుల క్వార్టర్స్‌లో మంత్రి తుమ్మలను కలిసి చిన్నారెడ్డి చర్చించారు. రైతులకు విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించే బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వ్యవసాయ అధికారులదేనని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చిందని కాసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతులు కోరిన మేరకు ఆయా కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. విత్తనాల కొరత అంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నకిలీ విత్తనాల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే పీడీ యాక్టు: సీఎస్
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై కలెక్టర్లతో గురువారం ఆమె టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌కు సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంటల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాల పంపిణీలో ఏవిధమైన ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితో పాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా ఉన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనిఖీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. గోదాములు, విత్తన విక్రయ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని ఆమె సూచించారు.