Share News

Tirupathi Reddy: బఫర్‌ జోన్‌లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:16 AM

తన ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.

Tirupathi Reddy: బఫర్‌ జోన్‌లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే

  • కొన్నప్పుడు దుర్గంచెరువు బఫర్‌జోన్‌ అని తెలీదు

  • రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి స్పందన

బంజారాహిల్స్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తన ఇల్లు బఫర్‌ జోన్‌లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. దుర్గం చెరువు సమీపంలోని డాక్టర్స్‌ కాలనీలో ఉండే తిరుపతిరెడ్డితో పాటు స్థానికులకు రెండు రోజుల క్రితం మీ ఇళ్లు బఫర్‌ జోన్‌లో ఉన్నాయని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై తిరుపతిరెడ్డి స్పందిస్తూ, అమర్‌ సొసైటీ ద్వారా పూర్వ యజమాని 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టారని చెప్పారు.


1995లోనే ఈ లే అవుట్‌కు అనుమతులు వచ్చాయని ప్రస్తావించారు. ఆ ఇంటిని తాను 2016లో కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో స్థలం ఎఫ్‌టీఎల్‌కు కానీ, బఫర్‌ జోన్‌కు కానీ వస్తుందనే విషయం తెలియదన్నారు. భూమి పత్రాలు న్యాయవాదికి చూపించిన తర్వాతే కొనుగోలు చేశానని చెప్పారు. ఇప్పుడు అధికారులు బఫర్‌ జోన్‌ అంటూ నోటీసులు ఇచ్చారని, అది నిజమే అయితే కొంత సమయం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వస్తానని, ఆ తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు.


తన ఇంటి విషయాన్ని బీఆర్‌ఎస్‌ రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ చేయలేని పనులు సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహిస్తున్నారని, అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతీది రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ తన ఇంటిపై చేస్తున్న వ్యాఖ్యల కారణంగా మొత్తం కాలనీలో ఉన్న నిర్మాణాలన్నీ ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు.

Updated Date - Aug 30 , 2024 | 03:16 AM