Revanth Reddy: నేడు రేవంత్ చివరి రోజు విదేశీ పర్యటన
ABN , Publish Date - Aug 13 , 2024 | 07:54 AM
అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియాకు చేరుకున్నారు.
హైదరాబాద్: అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్‌రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియాకు చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం ప్రస్తుతం దక్షిణ కొరియాలో సందర్శిస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన.. పరిశ్రమలు రాని వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు.
కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్‌చైర్మన్ సొయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందయ్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మెగా టెస్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. భారత్‌లోని హ్యుందయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ (హెచ్ఎంఐఈ) ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. ఇక నేడు ఫ్యూచర్ హంగంగ్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్‌కు రేవంత్ టీమ్ నేడు వెళ్లనుంది.
హన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్‌తో భేటీ కానున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. శామ్సంగ్ ప్రతినిధులతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ లీడర్‌షిప్‌తో చర్చలు నిర్వహింనున్నారు. అలాగే శామ్సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో భేటీ కానున్నారు. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ టీం పెట్టుబడులపై చర్చలు నిర్వహించనుంది. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ టీం సందర్శించనుంది. హన్ రివర్ ఫ్రంట్, హన్ రివర్ పార్క్ ఫీల్డ్ విజిట్ చేయనుంది. ఇక నేటి రాత్రికి రేవంత్ బృందం హైదరాబాద్‌కు పయనం కానుంది. అలాగే నిన్న విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల రంగంలో ఎల్ఎస్ పెట్టుబడులు..కొరియాలో అతిపెద్ద పరిశ్రమల గ్రూపు ఎల్ఎస్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.