Vikarabad: బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం
ABN , Publish Date - Nov 02 , 2024 | 03:58 AM
వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు. ఐదుగురూ గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.
నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. అంతా గంజాయి మత్తులో?
పోక్సో కేసు.. వికారాబాద్ జిల్లాలో ఘటన
దోమ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లున్నారు. ఐదుగురూ గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. బాధితురాలు 8వ తరగతి విద్యార్థిని. ఆమెకు కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ బాలుడితో పరిచయమేర్పడింది. ఇద్దరూ చనువుగా మెలిగారు. అక్టోబరు 28న పాఠశాల నుంచి ఇంటికొచ్చిన బాలికకు ఆ బాలుడు పథకం ప్రకారం గ్రామంలోని మరో బాలుడి ఇంట్లోకి తీసుకెళ్లాడు.
అక్కడ ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఆలస్యంగా రాత్రి ఇంటికి వెళ్లడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని బోరుమంది. బాధితురాలి తల్లిదండ్రులు అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారు డీఎస్పీ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ఆ నలుగురిపై 96, 172, 127, 76, 351, రెడ్ విత్ 49 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు దోమ ఎస్సై అరవింద్‌కుమార్ తెలిపారు. కాగా ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా 12 వారాల గర్భవతిగా నిర్ధారించినట్లు తెలిపారు.