Share News

Christmas Celebration: క్రిస్మస్‌ వేడుకల్లో అపశృతి

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:35 AM

క్రిస్మస్‌ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామంలో అపశృతి జరిగింది.

Christmas Celebration: క్రిస్మస్‌ వేడుకల్లో అపశృతి

  • శిలువ జెండా పైపునకు విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతం

  • యువకుడు మృతి, నలుగురికి గాయాలు

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన

కల్హేర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ వేడుకల్లో సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామంలో అపశృతి జరిగింది. చర్చి ఎదుట ఉన్న శిలువ జెండా పైపును పెయింట్‌ వేసేందుకు తీస్తుండగా, పైన ఉన్న విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఖాజాపూర్‌ గ్రామంలోని చర్చిని క్రిస్మస్‌ వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాసాలం సోపాన్‌ (19) మరికొందరు కలిసి చర్చి ఎదుట ఉన్న శిలువ జెండా ఇనుప పైప్‌ను పెయింట్‌ వేసేందుకు తీస్తున్నారు.


ఆ సమయంలో పైన ఉన్న విద్యుత్‌ తీగలు పైప్‌నకు తగిలి విద్యుదాఘాతంతో సోపాన్‌ అక్కడిక్కడే మృతిచెందగా, పెపును పట్టుకుని ఉన్న మరో నలుగురు గాయపడ్డారు. గ్రామస్థులు గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోపాన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 04:35 AM