Share News

Tragic accident: పెళ్లయిన నాలుగోరోజే.. పెను విషాదం!

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:16 AM

నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టిన వారి వివాహం నాలుగు రోజులకే ఘోర ప్రమాదంతో చిన్నాభిన్నమైంది. రాత్రిపూట వధూవరులు ద్విచక్రవాహనమ్మీద వేగంగా వెళుతూ రోడ్డు పక్కన ట్రాలీతో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు.

Tragic accident: పెళ్లయిన నాలుగోరోజే.. పెను విషాదం!

  • ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌

  • తల పగిలి వరుడి దుర్మరణం

  • తీవ్రగాయాలతో వధువు చావుబతుకుల్లో

  • సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో విషాదం

మేళ్లచెర్వు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టిన వారి వివాహం నాలుగు రోజులకే ఘోర ప్రమాదంతో చిన్నాభిన్నమైంది. రాత్రిపూట వధూవరులు ద్విచక్రవాహనమ్మీద వేగంగా వెళుతూ రోడ్డు పక్కన ట్రాలీతో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై వరుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వధువు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో జరిగింది. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ఈ ఘోరం, పెళ్లి వేడుక తాలూకు ఆనందకర జ్ఞాపకాల్లో ఉన్న ఇరు కుటుంబాలు, బంధువుల్లో పెను విషాదాన్ని నింపింది. బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామానికి చెందిన రాచూరి ఉపేందర్‌ (36)కు కొంత పొలం ఉంది. వరికోత యంత్రం డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు.


అతడికి మేళ్లచెర్వు మండల పరిధిలోని వెల్లటూరుకు చెందిన రత్నకుమారితో గత నెల 29న (శుక్రవారం) పెళ్లయింది. వధువు స్వగ్రామం వెల్లటూరులో నిద్ర చేసేందుకు తడకమల్ల నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరారు. వధూవరులు ఒక ద్విచక్ర వాహనంపై, బంధువులు వెనుక ఆటోలో బయలుదేరారు. రాత్రి ఏడు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ గడ్డి ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఉపేందర్‌ ఢీకొట్టాడు. బైక్‌ వేగంగా నడపడం, రాత్రిపూట ఆగివున్న ట్రాక్టర్‌ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ట్రాలీకి బలంగా తగలడంతో ఉపేందర్‌ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రత్నకుమారికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 04:16 AM