Medak: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:38 AM
మెదక్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం
మనోహరాబాద్, నవంబరు 2, (ఆంధజ్యోతి): మెదక్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలికలు ఉన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు(42) తన మరదలు(సోదరుడి భార్య) లావణ్య(30), ఆమె కుమార్తెలు సహస్ర(9), శ్రావ్య(7)ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని గ్రామ శివారులోని బస్టా్‌పకు బయలుదేరాడు.
గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు, లావణ్య, సహస్ర, శ్రావ్య అక్కడికక్కడే మరణించారు. స్థానిక రైతులు డబుల్ లేన్ రహదారిలో ఓ వైపు ధాన్యం ఆరబెట్టడంతో వాహనాలన్నీ ఒకే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.