Share News

KIMS Hospital: వెంటిలేటర్‌పైనే శ్రీతేజ

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:12 AM

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజకు ఇంకా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ కడిల్స్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

KIMS Hospital: వెంటిలేటర్‌పైనే శ్రీతేజ

  • జ్వరంతో ఇబ్బంది.. మెదడు, నాడీ సంబంధిత సమస్యలు

  • హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన కిమ్స్‌ కడిల్స్‌ వైద్యులు

  • 15 రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు

  • బాలుడి కుటుంబానికి అర్జున్‌ రూ.కోటి ఇవ్వాలి: మంద కృష్ణ

  • అర్జున్‌ను పరామర్శిస్తారు గానీ శ్రీతేజను చూడరా?

  • సినీ ప్రముఖుల తీరుపై బండ్రు శోభారాణి విమర్శ

హైదరాబాద్‌, రాంగోపాల్‌పేట్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజకు ఇంకా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ కడిల్స్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీతేజకు అందిస్తున్న చికిత్స, అతడి ఆరోగ్యస్థితిపై ఆదివారం సాయంత్రం ఆస్పత్రి హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది. ఆస్పత్రిలో బాబుకు పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (పీఐసీయూ)లో చికిత్స కొనసాగుతోందని వైద్యులు చేతన్‌ ఆర్‌.ముందాడ, విష్ణు తేజ్‌ తెలిపారు. శ్రీతేజ వైటల్‌ పారామీటర్స్‌ స్థిరంగా ఉన్నాయని, ట్యూబ్‌ ద్వారా ఇచ్చే ఆహారం బాగానే తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. బాలుడికి జ్వరం వస్తోందని.. మెదడు, నాడి సంబందిత సమస్యలతో బాధపడుతున్నాడని వివరించారు. నాడీ సంబంధిత ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వైద్యులు వివరించారు. కాగా శ్రీతేజను పరామర్శించేందుకు ఆదివారం మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆస్పత్రికి వచ్చారు.


శ్రీతేజ ఆరోగ్యస్థితి గురించి వైద్యులను, బాలుడి తండ్రి భాస్కర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీతేజ కుటుంబానికి అల్లు అర్జున్‌ రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీతేజను సినీ పరిశ్రమ, మా అసోసియేషన్‌ సభ్యులు కూడా ఆదుకోవాలని కోరారు. మరో 15 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటే తప్ప శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారని వెల్లడించారు. థియేటర్‌కు అల్లు అర్జున్‌ రాక విషయమ్మీద ముందుగానే పోలీసులకు సమాచారం ఉన్నప్పుడు తగిన బందోబస్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, అక్కడ భద్రతా వైఫల్యంపై పోలీస్‌ కమిషనర్‌, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీతేజను పరామర్శించడానికి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ఆస్పత్రికి వచ్చారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారని, బాలుడి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆమె చెప్పారు.


అభిమానం హద్దులు దాటితే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుందని, రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు. శ్రీతేజ వైద్యానికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని అల్లు అర్జున్‌ చెప్పినప్పటికీ ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి, బాలుడి వైద్య చికిత్సల ఖర్చు విషయంలో సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. శ్రీతేజ ఆరోగ్య స్థితి తెలుసుకునేందుకు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు బాలుడిని పరామర్శించామని ఆమె చెప్పారు. మరో రెండు వారాలు గడిస్తే కానీ బాలుడి ఆరోగ్య స్థితిపై స్పష్టమైన అవగాహన రాదని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను ఆయన ఇంటికి వెళ్లి సినీ ప్రముఖులు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న సినీ ప్రముఖులు నిరుపేద వర్గానికి చెందిన బాలుడిని పరామర్శించేందుకు ఎందుకు రావడం లేదని ఆమె ప్రశ్నించారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకుంటూ అభిమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. బెనిఫిట్‌ షోల పేరుతో సినీ ప్రముఖులు లాభం పొందడం తప్ప దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 05:12 AM