Model Markets: జిల్లాకో మోడల్ మార్కెట్: తుమ్మల
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:50 AM
రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఓ మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఓ మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కో-ఆపరేటివ్, మార్కెటింగ్ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన మంత్రి పలు అంశాలపై చర్చించారు. మార్కెట్ల ఆధీనంలోని గోదాములు, ఖాళీ స్థలాలు వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా చేసి ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి, నూతన శాఖల ఏర్పాటు అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మార్కెట్లు, జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో పంట కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల కోరారు. ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.19,144 చేయడంతో రైతుల తరఫున ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాష, జీఎం సుధాకర్‌రెడ్డి మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో శుక్రవారం భేటీ అయిన తుమ్మల.. సీతారామ ప్రాజెక్టులోని సత్తుపల్లి ట్రంకు పనులు త్వరగా చేపట్టాలని కోరారు.