Tumala: ఆయిల్ పామ్ టన్నుకు రూ.20వేలు!
ABN , Publish Date - Oct 29 , 2024 | 03:27 AM
ఆయిల్ పామ్ టన్ను గెలలకు కేంద్రప్రభుత్వం రూ.20వేలు చెల్లించేలా కృషి చేస్తానని, ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ పామ్ రేటు పడిపోయినా ఆ లోటును ప్రభుత్వమే భర్తీ చేసి రైతులకు రూ.20వేలు చెల్లించేలా
కేంద్రం చెల్లించేలా కృషి చేస్తా
రాష్ట్రంలో సాగుకు ఢోకా లేదు: తుమ్మల
దమ్మపేట, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆయిల్ పామ్ టన్ను గెలలకు కేంద్రప్రభుత్వం రూ.20వేలు చెల్లించేలా కృషి చేస్తానని, ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ పామ్ రేటు పడిపోయినా ఆ లోటును ప్రభుత్వమే భర్తీ చేసి రైతులకు రూ.20వేలు చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రాన్ని కోరుతానని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు పామాయిల్ సాగు చేస్తున్న రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగుపై ఇటీవలి మలేసియా పర్యటన వివరాలను ఆయన భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తన నివాసంలో వివరించారు.
అల్యూమినియం గెడలతో గెలలు కోసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మలేసియాలో ఫైబర్ గెడలను వినియోగిస్తున్నారని, వాటిని తెప్పించి రైతులకు సబ్సిడీపై అందిస్తామని తుమ్మల తెలిపారు. పామాయిల్ సాగులో అంతర పంటల ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునని, అంతర పంటలకు సబ్సిడీలు కూడా ఇస్తామని చెప్పారు. తెలంగాణలో పామాయిల్ సాగుకు ఢోకా లేదన్నారు. 31 జిల్లాల్లో పామాయిల్ సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే మలేిసియాలో మూడురోజులు పాటు ఆయిల్‌పామ్ సాగు విధానాన్ని పరిశీలించినట్లు తెలిపారు. రాష్ట్రం లో వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకు బియ్యం, పౌలీ్ట్ర, మామిడి ఎగుమతులపై అక్కడి ఆహార భద్రత మంత్రి మహ్మద్ బిన్‌సాబుతో చర్చించానని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరానని తెలిపారు.