Share News

Tummala : 20 రోజులైనా గండ్లు పూడ్చరా?

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:44 AM

సాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tummala : 20 రోజులైనా గండ్లు పూడ్చరా?

  • సాగర్‌ కాల్వ మరమ్మతు పనుల్లో జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం

  • వెంటనే పూర్తి చేయాలని ఆదేశం

  • నేటి నుంచే ఆయకట్టుకు నీరందించాలని దిశానిర్దేశం

కూసుమంచి, సెప్టెంబరు 23: సాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన కాల్వ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి మంగళవారం నుంచి ఆయకట్టుకు నీరు అందించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద సాగర్‌ కాల్వ పునరుద్ధరణ పనులను సోమవారం ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి ఆయన పరిశీలించారు.


అక్కడ జరుగుతున్న పనుల వివరాలను నీరుపాదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ విద్యాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యంపై ఇరిగేషన్‌ అధికారులను నిలదీసిన తుమ్మల.. రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా ఎండిపోయిన తరువాత నీళ్లిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యానికి కారకులైన అధికారులపై తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు.


  • అండర్‌ టన్నెల్‌ లేకుండానే మరమ్మతులు

మల్లాయిగూడెం వద్ద సాగర్‌ ఎడమకాల్వ మరమ్మతుల్లో భాగంగా అండర్‌ టన్నెల్‌ (యూటీ) లేకుండానే కాల్వ కరకట్టకు అధికారులు మరమ్మతులు(బండింగ్‌) చేస్తున్నారు. కూలిపోయిన యూటీని ఆదివారం పూర్తిగా తొలగించిన అధికారులు.. దాని స్థానంలో తాత్కాలికంగా సిమెంట్‌ పైపులు వేయాలని తొలుత నిర్ణయించారు. కానీ, రెండు లక్షల ఎకరాల్లో నీరందక వరి పొలాలు ఎండిపోతుండడం, పైపుల ఏర్పాటుకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉండడంతో తాత్కాలికంగా యూటీ లేకుండానే రెండు వైపులా కరకట్ట పనులు చేస్తున్నారు.


బండింగ్‌ అనంతరం గండిపడిన చోట్ల రెండువైపులా టార్పాలిన్‌ కవర్లతో కప్పివేయనున్నారు. కట్ట తిరిగి కోతకు గురికాకుండా మట్టి బస్తాలు ఏర్పాటు చేస్తున్నారు. యూటీ నిర్మాణం నిలిపివేసినందున జుజ్జులరావుపేట, పాలేరు, తదితర గ్రామాల నుంచి వచ్చే వరద నీటి జనరేటర్ల ద్వారా కాల్వలోకి ఎత్తిపోయాలని అధికారులు భావిస్తున్నారు. లేదంటే కాల్వ పక్కనే ఛానల్‌ నిర్మాణం ద్వారా నీటిని తరలించి వేరే చోటకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అన్ని పంటల్లో చీడ, పీడల బెడద పెరిగిందని, వాటిని నియంత్రించే దిశగా రైతులకు సూచనలు చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించాలని సూచించారు.

Updated Date - Sep 24 , 2024 | 02:44 AM