Share News

Tummala : రుణమాఫీపై సంతృప్తిగానే రైతులు

ABN , Publish Date - Oct 08 , 2024 | 03:43 AM

‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు.

Tummala : రుణమాఫీపై సంతృప్తిగానే రైతులు

  • మిగతావీ మాఫీ చేస్తామని భావిస్తున్నారు

  • అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా?

  • మాఫీపై మోదీ మాట్లాడడమా?: తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు. మిగిలిన రుణాలను మాఫీ చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. నిజంగా అసంతృప్తి ఉంటే వారు ఊరుకుంటారా? మార్కెట్‌ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి వేలాది మంది రైతులు వస్తున్నారు.. మేమూ రోజూ రైతులతోనే ఉంటున్నాం.. ఏ ఒక్కరూ రుణమాఫీ గురించి అడగడం లేదు. ఈ ప్రభుత్వంపై రైతులకు ఉన్న నమ్మకం అటువంటిది’’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పంట రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ ద్వారా లబ్ధి చేకూర్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.


ఇప్పటికే రూ.2లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. అంతకంటే ఎక్కువగా ఉన్న రుణాల మాఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. గాంధీభవన్‌ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’లో పాల్గొన్న తుమ్మల.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రుణమాఫీ అమలు చేయని ప్రధాని మోదీ.. తెలంగాణలో అమలు చేస్తున్న రుణమాఫీ గురించి మాట్లాడడమే ఆశ్చర్యమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేసి ఉంటే.. అదే పద్ధతిని అనుసరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌.. ఏ రకంగా రుణమాఫీ చేశారో అందరికీ తెలిసిందేని ఎద్దేవా చేశారు.


బీఆర్‌ఎస్‌ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరి చేసుకుంటూ... రైతు బంధుకు రూ.7,600 కోట్లు, రుణమాఫీకి రూ.18వేల కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ.25 వేల కోట్లు జమ చేసిన ఏకైక రాష్ట్రం.. తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా బాగా రుణమాఫీ జరిగి ఉంటే.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ చెప్పవచ్చన్నారు. అధికారం పోయిందని ఒక పార్టీ, అధికారం కోసం మరో పార్టీ కావాలని మాట్లాడుతున్నాయన్నారు. కాగా, ‘మంత్రితో ముఖాముఖి’లో భాగంగా పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి దాదాపుగా 95 వినతులను తుమ్మల స్వీకరించారు. వీటిలో భూ సమస్యలు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు.. వంటి అంశాలే ఎక్కువగా వచ్చాయి. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మండలానికి చెందిన వృద్ధురాలు యాదమ్మ... తన భూమికి సంబంధించిన సమస్యను విన్నవించగా.. అప్పటికప్పుడు ఆ జిల్లా కలెక్టర్‌కు తుమ్మల ఫోన్‌ చేశారు. సంబంధిత భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖి వంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 03:43 AM