Share News

Tummala : సీజన్‌కు ముందే జిన్నింగ్‌ మిల్లులు సిద్ధం చేయాలి

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:29 AM

మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు.

Tummala : సీజన్‌కు ముందే జిన్నింగ్‌ మిల్లులు సిద్ధం చేయాలి

  • కొనుగోలు కేంద్రాలు వారంలో 6 రోజులు పనిచేయాలి

  • పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షలో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనిష్ఠ మద్ధతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి రైతులకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), కాటన్‌ అసోసియేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సమీక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీల్లోకి కాటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సీసీఐ ప్రతినిఽధులకు సూచించారు. ఈ ఏడాది సాంకేతికంగా తీసుకువస్తున్న పేమెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ యాప్‌లతో మిల్లర్లకు కొనుగోళ్లలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీసీఐ, కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 10 , 2024 | 04:29 AM