Share News

Uttam: నీటి పారుదల శాఖ.. సీఈ, ఈఎన్‌సీపై చర్యలు

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:39 AM

నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ-జనరల్‌) జి.అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాను ఆదేశించారు.

Uttam: నీటి పారుదల శాఖ.. సీఈ, ఈఎన్‌సీపై చర్యలు

  • రాహుల్‌బొజ్జాను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌

  • ‘సీతారామ’ ప్రాజెక్టుపై సమీక్షలో.. మంత్రుల ముందే.. సీఈ వర్సెస్‌ ఈఎన్‌సీ

  • నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు

  • అధికారులకు మంత్రి ఉత్తమ్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ) ఎం.శ్రీనివా్‌సరెడ్డి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ-జనరల్‌) జి.అనిల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టులో అనుమత్తుల్లేకుండా డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం, అనుబంధ పనుల టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ అనుమతుల్లేకుండా పనులు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్ష సందర్భంగా.. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపర అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించినా, ఈఎన్‌సీ(జనరల్‌) సహకరించడం లేదని సీఈ ఆరోపణలు చేశారు.


దీనికి ఈఎన్‌సీ స్పందిస్తూ.. తమకు సవివర అంచనాలు(డిటైల్డ్‌ ఎస్టిమేట్స్‌) అందలేదని బదులిచ్చినట్లు తెలిసింది. ఈ వివరాలు లేకుండా అనుమతులు ఇస్తే.. అంచనాలు భారీగా పెరిగే ప్రమాదముందని వివరించారు. దాంతో సీఈ పెద్దగా అరుస్తూ.. ప్రభుత్వ ఆదేశాలతోనే టెండర్లను ఆహ్వానించినట్లు బదులిచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఒకరినొకరు ఏకవచనంతో పిలుచుకోవడంతో.. ఉత్తమ్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. దాంతో.. సీఈ, ఈఎన్‌సీని పిలిపించుకుని, తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాను మంత్రి ఆదేశించారు. కాగా.. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పరిపాలనపర అనుమతులివ్వగా, 2018 ఆగస్టులో రూ.13,057 కోట్లకు పెంచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబటుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆదివారం సామాజిక మాధ్యమం వేదికగా కేటీఆర్‌ ఆరోపణలు చేశారు.


  • గత నెలలోనే ప్రతిపాదనలు

డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. డిటైల్డ్‌ ఎస్టిమేట్స్‌, డిజైన్లు, డ్రాయింగ్స్‌ లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్‌సీ(జనరల్‌) ఆ ప్రతిపాదనలను వెనక్కి పంపారు. గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పరిపాలనాపరమైన అనుమతులే కాకుండా.. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల ఉల్లంఘననే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. అయితే.. మంత్రుల సమీక్ష మినట్స్‌లో.. తక్షణమే టెండర్లను నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్లు స్పష్టంగా ఉందని, అందుకే టెండర్లను పిలిచినట్లు బాధ్యులైన అధికారులు చెబుతున్నట్లు సమాచారం.


  • బిడ్లను తెరవడానికి అనుమతులు తప్పనిసరి

డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీఓటీ)లోని చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్‌-1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పనులకు పరిపాలనపర అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి.. పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈఎన్‌సీ(జనరల్‌) పదేపదే ప్రస్తావించడమే వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్‌ విచారణ జరుగుతోంది. విజిలెన్స్‌ విచారణలు కూడా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే..!

Updated Date - Nov 04 , 2024 | 04:39 AM