Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!
ABN , Publish Date - Nov 06 , 2024 | 03:01 AM
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తామన్నారు.
తరుగు, తాలు సమస్య ఉండదు: ఉత్తమ్
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తామన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించగానే బ్యాంకు గ్యారెంటీలను మిల్లర్లకు తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైస్ మిల్లుల పరిశ్రమకు అండగా ఉంటామని, ప్రభుత్వం, మిల్లర్లు పరస్పర అవగాహనతో ముందుకు సాగాలని ఉత్తమ్ సూచించారు.
తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని, కొనుగోళ్లలో తరుగు, తాలు సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు. ఈ సీజన్‌లో కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, దేశంలో ఇదో రికార్డని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్లు అవసరమని అంచనా వేశామని, ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. 32 జిల్లాల్లో 7,572 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 3,309 రైస్‌మిల్లులు సేకరణలో భాగస్వాములవుతాయని పేర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఏ మాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.