మెనోపాజ్‌కు.. దేశీయ ‘గడ్డి’తో ఔషధం
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:34 AM
మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే మెనోపాజ్ (రుతుచక్రం ఆగిపోయే దశ) సమస్యలకు చెక్ పెట్టే ఔషధాన్ని.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్త వందనా సింగ్ అభివృద్ధి చేశారు!
అభివృద్ధి చేసిన ఎన్‌ఐఎన్ పరిశోధకురాలు వందనా సింగ్
హైదరాబాద్, డిసెంబరు 27: మహిళలను తీవ్రంగా ఇబ్బందిపెట్టే మెనోపాజ్ (రుతుచక్రం ఆగిపోయే దశ) సమస్యలకు చెక్ పెట్టే ఔషధాన్ని.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్త వందనా సింగ్ అభివృద్ధి చేశారు! అది కూడా దేశీయంగా దొరికే గడ్డితో ఆమె ఆ ఔషధాన్ని తయారుచేయడం విశేషం. ఈ ఔషధానికి పేటెంట్ కూడా మంజూరైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నడివయసు మహిళలు మెనోపాజ్‌కు ముందు, తర్వాత పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
దీన్ని మెనోపాజ్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. ఈ సమస్యకు ఎన్‌ఐఎన్‌కు చెందిన వందనా సింగ్ ఎటువంటి దుష్ప్రభావాలూ లేని ఔషధాన్ని కనుగొనేందుకు నడుం బిగించారు. స్వతహాగా ఆమె ఆయుర్వేద వైద్యురాలు కావడం.. దేశీయ గరికలో ఉండే ఔషధగుణాల గురించి తెలిసి ఉండడంతో.. మెనోపాజ్‌కు ‘నాన్ హార్మోనల్ థెరపీ ఫార్ములేషన్’ను అభివృద్ధి చేశారు. దీనికి ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది.