Train Delays: వందేభారత్.. ఆలస్యం!
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:35 AM
అధునాతన వసతులు, వేగంగా ప్రయాణంతో కొత్త తరం రైళ్లుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయి.
సాంకేతిక లోపాలతో గంటల కొద్దీ జాప్యం
అదనపు రేక్ లేక అవస్థలు
పండుగ వేళా ఇదే తీరు.. ప్రత్యేక రైళ్లపై ప్రభావం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): అధునాతన వసతులు, వేగంగా ప్రయాణంతో కొత్త తరం రైళ్లుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయి. పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతూ.. రోజుల పాటు సర్వీసులు రద్దవుతున్నాయి. ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ వారంపాటు ఇలానే తిప్పలు పెట్టింది. విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన రైలు 8 బోగీల్లో ఏసీ వ్యవస్థ విఫలమైంది. చివరి నిమిషంలో నిలిపివేశారు. ఆ రైలు రాకపోవడంతో.. రేక్ లేని కారణంగా సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన సర్వీసును రద్దు చేశారు.
దసరా, దీపావళి, చాట్ పూజ.. తదితర పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెగ్యులర్ రైళ్లతో పాటు 1,400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇవి ప్రయాణించే లైన్లకు తాకిడి పెరగడంతో వందే భారత్ వేగం తగ్గుతోంది. క్లియరెన్స్ కోసం వందేభారత్ లోకో పైలట్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాధారణ రైళ్లకు బయల్దేరిన స్టేషన్ నుంచి ఒక స్టేషన్‌కే క్లియరెన్స్ ఇస్తారు. వందేభారత్‌లకు ఐదు స్టేషన్ల క్లియరెన్స్ ఒకేసారి ఇవ్వాలి. దీంతోనే ప్రత్యేక రైళ్ల రాకపోకలు అధికంగా ఉన్న మార్గాల్లో రూట్ క్లియరెన్స్ త్వరగా కావడం లేదు. ఇక పట్టాల మరమ్మతుతో కొన్ని స్టేషన్ల మధ్య 30-40 కిలోమీటర్ల వేగంతోనే నడపాలని సూచిస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఒక అదనపు రేక్‌ను సమకూర్చుకుంటే ఆలస్యాన్ని నివారించవచ్చు.
వందేభారత్ రైళ్లన్నీ వారంలో ఆరు రోజులు నడుస్తుండగా, ఒక రోజు నిర్వహణకు కేటాయించారు. లేదంటే ఏదేని ఒక వందేభారత్‌లో సాంకేతిక లోపం తలెత్తితే వారం ఆలస్యంగా నడపాల్సి రావడం, వీలుకాని పక్షంలో రద్దు చేయడం తప్పనిసరి అవుతోంది. అదనపు రేక్ ఉంటే.. సాంకేతిక సమస్యలు తలెత్తినా రద్దు చేయకుండా మెరుగైన సర్వీసు అందిచవచ్చని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు రైల్వేబోర్డుపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లు కనిష్ఠంగా 10 నిమిషాల నుంచి గరిష్ఠంగా 58 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.