Share News

అమ్మో.. ఆకుకూరలు!

ABN , Publish Date - Sep 17 , 2024 | 01:54 AM

కొత్తిమీర రేటు కొండమీదికెక్కింది! పప్పులో వేసుకునే పాలకూర ధర బాగా ప్రియమైంది!! వీటితోపాటు నిన్న, మొన్నటి వరకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న బెండకాయ, దొండకాయ, క్యారెట్‌ తదితర కూరగాయల ధరలు సైతం క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అమ్మో.. ఆకుకూరలు!

కిలో పాలకూర రూ.180కి పైగా.. కొత్తిమీర రూ.120

  • బెండ, దొండ, క్యారెట్‌ రేట్లూ అంతే

  • వర్షాలతో తగ్గిన దిగుమతి

  • మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తగ్గిపోయిన ఉల్లి లారీల రాక

  • ఉన్న సరుకు ధరను పెంచిన వ్యాపారులు

  • పెరిగిన ధరలతో ప్రజల గగ్గోలు

హైదరాబాద్‌ సిటీ, ఓల్డ్‌మలక్‌పేట, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): కొత్తిమీర రేటు కొండమీదికెక్కింది! పప్పులో వేసుకునే పాలకూర ధర బాగా ప్రియమైంది!! వీటితోపాటు నిన్న, మొన్నటి వరకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న బెండకాయ, దొండకాయ, క్యారెట్‌ తదితర కూరగాయల ధరలు సైతం క్రమేపీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉల్లిగడ్డల ధర కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో మొదటిరకం ఉల్లి ధర టన్ను రూ.51 వేలు పలికి ఆరు నెలల గరిష్ఠానికి చేరింది. అక్కడ కిలో రూ.51 పలుకుతుండగా.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.60 అమ్ముతున్నారు.


పప్పు, ఉప్పు కంటే ఆకు కూరల ధరలు భారీగా పెరిగిపోతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబజార్లలోనే కూరగాయల ధరలు ఇలా ఉన్నాయంటే.. ఇక, సూపర్‌మార్కెట్లు, కాలనీల్లోని రిటైల్‌ దుకాణాల్లో ఆకు కూరలు, కొన్నిరకాల కూరగాయల ధరల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు! రాజధాని నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్లు, రైతుబజార్లకు శివారు ప్రాంతాలైన యాచారాం, మంచాల, మహేశ్వరం, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం నుంచి టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయ, బెండకాయతోపాటు వివిధ రకాల ఆకుకూరలు వస్తుంటాయి.


అలాగే ఏపీలోని మదనపల్లి నుంచి టొమాటో, మహారాష్ట్రలోని నాసిక్‌, సోలాపూర్‌తోపాటు కర్నూల్‌ జిల్లా నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వస్తుంటాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వివిధ రకాల కూరగాయల దిగుమతి బాగా తగ్గింది. మరీ ముఖ్యంగా.. నగర శివారు నుంచి వచ్చే పాలకూర, కొత్తిమీర, పుదీనా లాంటివి ఆశించిన మేరకు రాకపోవడంతోపాటు వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న అన్నదానాల నేపథ్యంలో వ్యాపారులు ఉన్న సరుకు ధరలు అడ్డగోలుగా పెంచేసి దోచుకుంటున్నారు. ఇక, ఉల్లి విషయానికి వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మలక్‌పేట మార్కెట్‌కు 60 లారీల ఉల్లి వచ్చేది. వినాయకచవితి నేపథ్యంలో అది ఇప్పుడు 37 లారీలకు తగ్గింది.


  • నాలుగు కట్టలు రూ.100!

సాధారణంగా మార్కెట్లలో ఇతర కూరగాయలతో పోల్చితే ఆకుకూరల రేట్లు అన్ని వర్గాల ప్రజలకూ కాస్తంత అందుబాటులో ఉంటాయి. రూ.20 పెడితే నాలుగు నుంచి ఆరు కట్టల పాలకూర, రూ.10 పెడితే కొత్తిమీర, పుదీనా కట్టలు రెండు, మూడు వస్తాయి. కానీ, ఇప్పుడా పరిస్థితే లేదు! చిన్నసైజు పాలకూర కట్ట ధర రూ.20 దాకా చెబుతున్నారు. పది రూపాయలకు కొత్తిమీర అడిగితే ఇచ్చేదే లేదంటున్నారు. సూపర్‌ మార్కెట్లలో అయితే నాలుగు కట్టల పాలకూర రూ.100కు పైమాటే! రూ.200 పట్టుకుని వెళ్తే కనీసం నాలుగైదు రకాల కూరగాయలు కూడా రావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కూరగాయల రేట్లు మరో వారంలోగా దిగి వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు.


వర్షాల కారణంగానే ఆకుకూరల దిగుమతి తగ్గిందని, శివారు ప్రాంతాల నుంచి త్వరలో పెరుగుతుందని వెల్లడించారు. రైతుబజార్లకు సరుకు రాకుండా కొంతమంది వ్యాపారులు నేరుగా చేలవద్దకు వెళ్లి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తుండడం వల్ల కూడా నగరంలో కొరత ఏర్పడుతోందని.. రవాణా చార్జీలను సాకుగా చూపి సామాన్య ప్రజలకు కావాల్సిన కూరగాయలను అందకుండా చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

రైతుబజార్‌లో కూరగాయల రేట్లు

నగరంలోని రైతుబజార్లలో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి..

రకం కిలోకు

పాలకూర రూ.180-200

కొత్తిమీర రూ.100-120

చిక్కుడు రూ.80-100

టొమాటో రూ.31

వంకాయ రూ.35

బెండ రూ.45

క్యారెట్‌ రూ.50

దొండ రూ.45

ఉల్లిగడ్డ రూ.54

క్యాప్సికమ్‌ రూ.70

Updated Date - Sep 17 , 2024 | 01:54 AM