Share News

Tiger Hull Chal: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ABN , Publish Date - Dec 11 , 2024 | 07:21 AM

ములుగు: జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు.

Tiger Hull Chal: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

ములుగు: జిల్లాలో పెద్దపులి సంచారంతో (Tiger Roams) ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి (Godavari) పరివాహక ప్రాంతంలో పెద్దపులి సచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు (Forest Officials) గుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు. తొలుత వెంకటాపురం మండలం, బోదాపురం, ఆలుబాక శివార్లలో రైతులు పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు. తర్వాత గోదావరి దాటి ఇవతలి వైపు మంగపేట మండలంలోకి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో గ్రామాల్లో మినీ మైకుల ద్వారా అధికారులు దండోరా వేయించారు. మంగపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరిలో చేపలవేటకు, పశువుల మేతకు అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక బోధాపురం సమీపంలో పెద్దపులి కలకలం సృష్టించింది. మిర్చి తోటలకు వెళ్లే దారిలోని గోదావరి పాయలో కొందరు స్థానికులు పెద్దపులి అడుగులను గుర్తించారు. భయపడిపోయి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అలుబాక బోధాపురం శివారులోని అడుగులను పరిశీలించారు. అవి పెద్దపులి అడుగులేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. గోదావరి తీర ప్రాంతంలో కొంతమంది రైతులు పుచ్చతోటలు సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి తోటల వద్ద పడుకున్న సమయంలో పెద్ద పులి అరుపులు వినిపించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.


మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు. అదే పులిని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, సాయంత్రం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మాకిడి రైల్వే క్యాబిన్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా స్థానికులు గుర్తించారు. అలాగే... ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక సమీపంలోని గోదావరి లంకలోనూ మంగళవారం పులి సంచరించింది. బోదాపురం రైతు కొర్స నర్సింహారావు లంకభూమిలో పుచ్చ పంట సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి పంటకు రక్షణగా వెళ్లి అక్కడ వేసుకున్న పాకలో నిద్రించారు. అర్ధరాత్రి పులి గాండ్రింపులు వినిపించాయి. మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు.


ఎటు వైపు వెళ్లింది..

వెంకటాపురం మండలం అలుబాక శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్దపులి అడుగులను బట్టి.. అది ఎటువైపు వెళ్లి ఉంటుందోనని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపులి ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. జనావాసాల్లోకి పులి ప్రవేశిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో పులి ఆచూకీకి కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు. గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలా పెద్దపులి సంచారం తరచూ కలకలం రేపుతుండగా.. ఇప్పుడు మరోసారి అదే భయం జనాలకు పట్టుకుంది. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అధికారులు పశువుల కాపరులతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి అడుగు జాడలతో పాటు ఇతర ఏ సమాచారం ఉన్నా.. వెంటనే తమకు చేరవేయాల్సిందిగా స్థానికులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు నోటీసులు

మీడియాపై మోహన్ బాబు చిందులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 11 , 2024 | 07:21 AM