Secunderabad: గాంధీలో నీళ్లు లేక శస్త్రచికిత్సలు వాయిదా!
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:18 AM
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు.
నీటి సరఫరాలో అంతరాయం
బాత్‌రూంలకు తాళాలు వేసిన సిబ్బంది
కాలకృత్యాలకు రోగుల అవస్థలు
అడ్డగుట్ట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోతున్నారు. నీళ్లు లేక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. తాగేందుకు కూడా నీళ్లు లేక బయట నుంచి తెచ్చుకుంటున్నారు.శనివారం రాత్రి నుంచి నీటి సరఫరా లేదని రోగులు తెలిపారు. చిన్నపిల్లల వార్డుల్లో నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడంలేదని చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాత్‌రూంలకు తాళాలు
రెండు రోజులుగా ఆస్పత్రిలో నీళ్లు రాకపోవడంతో సిబ్బంది బాత్‌రూంలకు తాళాలు వేశారు. రోగులు, వారి సహాయకులు అపరిశుభ్రం చేస్తారనే నెపంతో మొదటి అంతస్తు నుంచి 7వ అంతస్తు వరకు బాత్‌రూంలకు తాళాలు వేశారు.
తాగునీరు లేక రోగుల ఇక్కట్లు
రేడియాలజీ విభాగం పక్కనే ఉన్న మంచినీటి కుళాయిలో నీళ్లు రాకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రి బయట ఉన్న దుకాణాల్లో మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి రావడంతో రోగులు, వారి సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే మినరల్ వాటర్ బాటిళ్లను డైట్ క్యాంటీన్‌కు మళ్లిస్తున్నారని తెలిసి రోగుల సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. డైట్ క్యాంటీన్‌కు మంచినీటి బాటిళ్లు సరఫరా చేసినట్లే ప్రతి వార్డుకూ వాటర్ బాటిళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల నుంచి నీటి సరఫరా లేదనేది వాస్తవమేనని మోటార్ పంప్ మరమ్మతుల వల్ల ఇబ్బంది ఏర్పడిందని హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మరమ్మతులు పూర్తికాగానే నీటి సరఫరా చేస్తామన్నారు.