Share News

Hyderabad Weather: వేడీ ఎక్కువే.. చలీ ఎక్కువే!

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:22 AM

పేరుకు చలికాలం వచ్చిందన్నమాటేగానీ.. ఒకరకమైన విచిత్రమైన వాతావరణం నెలకొంది! పగటి పూట ఎండ సెగలు.. రాత్రయితే చలిగాలులు.. ఇదీ మూణ్నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి!!

Hyderabad Weather: వేడీ ఎక్కువే.. చలీ ఎక్కువే!

  • మధ్యాహ్నం 32 ..రాత్రి 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు

  • రాజధానిలో పెరిగిన చలిగాలులు

  • నిరుడు నవంబర్‌ కంటే 1-2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పేరుకు చలికాలం వచ్చిందన్నమాటేగానీ.. ఒకరకమైన విచిత్రమైన వాతావరణం నెలకొంది! పగటి పూట ఎండ సెగలు.. రాత్రయితే చలిగాలులు.. ఇదీ మూణ్నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి!! పగటి పూట 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే.. రాత్రిపూట 18-20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలతో చలి వాతావరణం! కిందటి సంవత్సరం నవంబరులో ఇదే తేదీలతో పోలిస్తే.. ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు సగటున 1-2 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం గమనార్హం. గత మూడురోజులుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో చలిగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా చెట్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో నవంబరు 5వ తేదీ వరకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23-20 డిగ్రీల వరకు నమోదవగా.. గత మూడురోజులుగా 18.5 డిగ్రీలకు పడిపోయాయి. శుక్రవారం పఠాన్‌చెరులో 15.2, రాజేంద్రనగర్‌లో 16.5, దుండిగల్‌లో 17.9, హకీంపేటలో 18.3, హైదరాబాద్‌లో 18.5, హయత్‌నగర్‌లో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


  • జిల్లాల్లోనూ..

రాష్ట్రంలోని కొన్నిజిల్లాల్లో రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకున్నాయి. గురువారం సంగారెడ్డి, కుమ్రం భీమ్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14.1 నుంచి 14.7 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. శని, ఆది, సోమవారాల్లోనూ.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 15-18 డిగ్రీల మద్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇందులో ఒకటి రెండు జిల్లాల్లో 15 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

అప్పుడు.. ఇప్పుడు..

(2023) (2024)

తేది గరిష్ఠం-కనిష్ఠం గరిష్ఠం- కనిష్ఠం

05 31.3 - 23.2 31.0 - 20.2

06 30.8- 22.8 32.4 - 18.5

07 30.8 - 22.6 32.4 - 18.4

08 30.7- 22.3 31.8 - 18.5

హైదరాబాద్‌లో గత ఏడాది, ఈ ఏడాది నవంబరు

5, 6, 7, 8 తేదీల్లో నమోదైన గరిష్ఠ- కనిష్ఠ ఉష్ణోగ్రతలు..

Updated Date - Nov 09 , 2024 | 03:23 AM