Share News

Gandhi Hospital: ‘గాంధీ’లో ఎక్స్‌రేలకు తిప్పలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 05:18 AM

తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఎక్స్‌ రే యంత్రాలు పని చేయడం లేదు. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి.

Gandhi Hospital: ‘గాంధీ’లో ఎక్స్‌రేలకు తిప్పలు

  • ఆస్పత్రిలో ఆర్నెల్లుగా మూలన పడ్డ యంత్రాలు

  • ఐదింటికిగాను వాడుకలో ఉన్నది ఒకే ఒక్కటి

  • ఐపీ, ఓపీ విభాగాల్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు

  • ఎక్స్‌ రే తీయించుకోవడానికి 2, 3 రోజులు పడిగాపులు

అడ్డగుట్ట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఎక్స్‌ రే యంత్రాలు పని చేయడం లేదు. ఆస్పత్రి మొత్తం ఐదు యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారు. డబ్బులు లేని నిరుపేదలు ఆస్పత్రిలోనే ఎక్స్‌ రే తీయించుకోవాలనుకుంటే రెండు, మూడు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది.


మరోవైపు, హైదరాబాద్‌లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్‌ల్లో గాంధీకి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్స్‌రేలు తీయడం ఇబ్బందిగా మారుతోంది. ఆర్నెల్లుగా యంత్రాలు పనిచేయకపోయినా.. పట్టించుకోకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిల్లో పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇరవై రోజుల క్రితం కథనం వచ్చింది. దీనిపై స్పందించిన తెలంగాణ డీఎంఈ డాక్టర్‌ వాణి అదే రోజు ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఎక్స్‌రే యంత్రాల విషయం ప్రస్తావనకు వచ్చింది. పాడైపోయిన యంత్రాలను మూడు రోజుల్లో బాగు చేస్తామని ఆమె హామీ ఇచ్చినా.. సమస్య పరిష్కారం కాలేదు.


  • విడి భాగాలు ముంబై నుంచి రావాలి

ఎక్స్‌రే యంత్రాల విడి భాగాలు ముంబై నుంచి రావాలని రేడియాలజీ విభాగం ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ రాజేశ్వరి తెలిపారు. కంపెనీకి సమాచారం ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో ముంబై నుంచి టెక్నీషియన్లు వస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 05:18 AM