Yadagirigutta: భక్తజన సంద్రం యాదాద్రి
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:22 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి రోజు, ఆదివారంకావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు
భువనగిరి అర్బన్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి రోజు, ఆదివారంకావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొండకింద లక్ష్మీపుష్కరిణి, సత్యదేవుడి వ్రత మండపాలు, కొండపైన ప్రధానాలయ ఉత్తర దిశ, శివాలయం వద్ద దీపారాధనల స్థలాల్లో మహిళా భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన గర్భాలయంలో పంచనారసింహులతోపాటు శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలను అర్చకులు వైభవంగా చేపట్టారు. సుమారు 50 వేల మంది భక్తులు యాదగిరీశుడిని దర్శించుకున్నట్లు అంచనా. క్యూలైన్లల్లో భక్తులు బారులు తీరగా వీఐపీ దర్శనానికి గంట సమయం, ధర్మదర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. కాగా, వాహనాలకు పార్కింగ్ స్థలం సరిపడా లేకపోవడంతో పలువురు భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ ఖజానాకు రూ. 56 లక్షల నిత్యాదాయం సమకూరిందని ఈవో భాస్కరరావు వెల్లడించారు.